‘ప్యాకేజీ’ పరుగు! | Sensex ends 1265 points higher And Nifty at 9111 | Sakshi
Sakshi News home page

‘ప్యాకేజీ’ పరుగు!

Published Fri, Apr 10 2020 5:07 AM | Last Updated on Fri, Apr 10 2020 5:57 AM

Sensex ends 1265 points higher And Nifty at 9111 - Sakshi

కేంద్ర ప్రభుత్వం రెండో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తుందన్న ఆశలతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడింది. సెన్సెక్స్‌ 31,150 పాయింట్లపైకి, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,100 పాయింట్లపైకి ఎగబాకాయి. ఇతర దేశాల్లో కరోనా కేసులు చివరి దశకు  చేరాయని, ఆయా దేశాలు ప్యాకేజీని ఇవ్వగలవన్న అంచనాలతో ప్రపంచ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. దీంతో మన మార్కెట్లో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో నిఫ్టీ వీక్లీ ఆప్షన్ల ముగింపు రోజు అయినప్పటికీ, స్టాక్‌ సూచీలు రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే  ముగిశాయి. ఇంట్రాడేలో నష్టపోయినప్పటికీ, డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం కూడా సానుకూల  ప్రభావం చూపించింది.

ఏడు వారాల నష్టాలకు బ్రేక్‌...
గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,266 పాయింట్లు ఎగసి 31,160 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 363 పాయింట్లు  పెరిగి 9,112 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 4.23 శాతం, నిఫ్టీ 4.15 శాతం చొప్పున ఎగిశాయి. రెండు రోజుల సెలవుల కారణంగా ఈ వారంలో ట్రేడింగ్‌ మూడు రోజుల పాటే జరిగినా, సెన్సెక్స్,నిఫ్టీలు భారీగానే లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 3,569 పాయింట్లు, నిఫ్టీ 1,028 పాయింట్ల చొప్పున పెరిగాయి. ఈ రెండు సూచీలు చెరో 13  శాతం మేర లాభపడ్డాయి. ఏడు వారాల వరుస నష్టాలకు ఈ వారం బ్రేక్‌ పడింది.  

త్వరలోనే రెండో ప్యాకేజీ
కరోనా వైరస్‌ కల్లోలంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పడేయటానికి ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా రూ. లక్ష కోట్ల రెండో ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేస్తోందన్న వార్తలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు ఊరటనిచ్చేలా వడ్డీ రాయితీ పథకాలు, రియల్టీ రంగానికి తాయిలాలు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూల ధన నిధుల కేటాయింపులు ఈ రెండో ప్యాకేజీలో ఉంటాయని అంచనా. కాగా జపాన్‌ నికాయ్‌ సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు 1% మేర లాభపడగా, యూరప్‌ మార్కెట్లు 2–3 శాతం మేర పెరిగాయి.  

మరిన్ని విశేషాలు....
► మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్‌ 17% లాభంతో రూ.381 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు షేర్లు– నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 26 షేర్లు లాభాల్లో ముగిశాయి.   
► దాదాపు 30కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. వీటిల్లో ఫార్మా షేర్లే అధికంగా ఉండటం విశేషం. అజంతా ఫార్మా, అబాట్‌ ఇండియా, క్యాడిలా హెల్త్‌కేర్, అల్కెమ్‌ ల్యాబొరేటరీస్, సిప్లా, దివీస్‌ ల్యాబ్స్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, టొరంటొ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► దాదాపు 500కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. రేమండ్, జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్, శోభ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.


రూ.లక్ష కోట్లతో మరో ప్యాకేజీ!
వ్యాపార సంస్థలు, రియల్టీ, పీఎస్‌బీలపై దృష్టి
ముంబై: కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించొచ్చని, గత నెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ఉద్దీపనల తరహాలోనే ఇది కూడా ఉంటుందని బ్యాంకు ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ సంస్థ పేర్కొంది. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు రుణాలపై వడ్డీ రాయితీలు, సమస్యలను ఎదుర్కొంటున్న రియల్టీ రంగానికి ప్రోత్సాహకాలు, ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయం అందించడంపై నూతన ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని బ్యాంకు ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ సూచించింది. పేద, బలహీన వర్గాలు, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక ప్రోత్సాహకాలతో కేంద్రం గత నెలలో ప్రకటించిన రూ.1.75 లక్షల కోట్ల ప్యాకేజీలో దృష్టి పెట్టిన విషయం విదితమే. కేంద్ర ఆర్థిక శాఖ జీడీపీలో కనీసం 0.3 శాతం మేర ఆర్థిక ఉద్దీపనలు ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంకు ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ సెక్యూరిటీస్‌ ఆర్థికవేత్తలు తమ నివేదికలో తెలిపారు. జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతానికి పడిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇన్వెస్టర్లూ!! తొందర వద్దు...
ఇటీవలి స్టాక్‌ మార్కెట్‌ ఉత్థానాలు బేర్‌ మార్కెట్‌ ర్యాలీలని కొందరు విశ్లేషకులంటున్నారు. రికవరీ మొదలయిందనే అంచనాలతో కొనుగోళ్లకు తొందర పడవద్దని వారు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు.  ప్రస్తుత పెరుగుదల స్వల్పకాలిక బేర్‌ మార్కెట్‌ ర్యాలీ అని, ఇది కొనసాగే అవకాశాలు లేవని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నా, 21 రోజుల లాక్‌డౌన్‌ మంచి ఫలితాలనే ఇవ్వగలదన్న విషయం రానున్న రోజుల్లో వెల్లడి కానున్నదని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ సంజీవ్‌ జర్భాడే వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్ల వేల్యూయేషన్లు ఇప్పుడు సమంజసంగానే ఉన్నాయని పేర్కొన్నారు.  బ్యాలె న్స్‌ షీట్‌ పటిష్టంగా, నిర్వహణ సామర్థ్యం బాగా ఉండి, మార్కెట్‌ లీడర్లుగా ఉన్న షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేయవచ్చని ఆయన సూచించారు. ఆర్థిక పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఈ షేర్లు మంచి రాబడులనిస్తాయని పేర్కొన్నారు.

మార్కెట్లు పడుతున్నా.. చెదరని విశ్వాసం
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం
మార్చి మాసంలో రూ.11,485 కోట్ల రాక
సిప్‌ రూపంలో రూ.8,641 కోట్లు


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విస్తరణ కారణంగా ఆర్థిక మాంద్యం తప్పదన్న భయాలతో ఈక్విటీ మార్కెట్లు గత నెలలో భారీ పతనాలను చవిచూశాయి. స్టాక్స్‌ 30–90 శాతం మధ్య వాటి గరిష్టాల నుంచి పడిపోయాయి. కానీ, ఇవేవీ మన దేశీయ ఇన్వెస్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయలేదు. ఇంత మంచి అవకాశం మళ్లీ మళ్లీ రాదనుకున్నారు. ఫలితమే మార్చి నెలలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి నికరంగా 11,485 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏడాది కాలంలో ఒక నెలలో ఈక్విటీల్లోకి అధిక పెట్టుబడులు రావడం మళ్లీ ఇదే.   మార్చి నెలలో మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నుంచి రూ.2.13 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ముఖ్యంగా మనీ మార్కెట్, లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి అధిక స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగినట్టు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) తెలిపింది.

సిప్‌ ఆపేది లేదు..!  
► ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి మార్చి నెలలో రూ.11,723 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే సమయంలో క్లోజ్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకాల నుంచి రూ.238 కోట్ల ఉపసంహరణ జరిగింది. దీంతో నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.11,485 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం నెల ఫిబ్రవరిలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.10,760 కోట్లతో పోల్చి చూస్తే పెరిగాయి.
► మల్టీక్యాప్‌ పథకాల్లోకి రూ.2,268 కోట్లు, లార్జ్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.2,060 కోట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి రూ.1,551 కోట్లు, మిడ్‌క్యాప్‌ పథకాల్లోకి రూ.1,223 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.  
► సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) పట్ల ఇన్వెస్టర్ల నిబద్ధతను తెలియజేస్తూ ఈ మార్గంలో వచ్చిన పెట్టుబడులు మార్చి నెలలో రూ.8,641 కోట్లకు చేరాయి. ఇలా సిప్‌ రూపంలో రూ.8,000 కోట్లకు పైగా ప్రతీ నెలా రావడం గత 16 నెలలుగా కొనసాగుతూ వస్తోంది.


ఇన్వెస్టర్ల సంపద 4 లక్షల కోట్లు అప్‌
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.4 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.4 లక్షల కోట్లు పెరిగి రూ.120.82 లక్షల కోట్లకు చేరింది.


నేడు గుడ్‌ఫ్రైడే సెలవు
గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు సెలవు. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement