ఊగిసలాటలో మార్కెట్
సెన్సెక్స్‌కు 54 పాయింట్లు, నిఫ్టీకి 18 పాయింట్లు లాభం
స్టాక్ మార్కెట్ శుక్రవారం షార్ట్ కవరింగ్ కారణంగా స్వల్పలాభాలతో గట్టెక్కింది. ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి, మే వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెల్లడయ్యాయి) నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్రమైన ఊగిసలాటకు గురయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 54 పాయింట్ల లాభంతో 26,425 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 7,983 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, విద్యుత్, రిఫైనరీ, వాహన షేర్లలో కొనుగోళ్లు జరగగా, ఐటీ, టెక్నాలజీ, మెటల్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు, కీలక గణాంకాల వెల్లడి కారణంగా ఇన్వెస్టర్లు జాగరూకతగా వ్యవహరించడం మార్కెట్ లాభాలకు కళ్లెం వేశాయని నిపుణులంటున్నారు. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,205 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.12,623 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,96,271 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టరు లరూ.671 కోట్ల నికర అమ్మకాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.706 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.