ముంబై: ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ భయాల నుంచి దలాల్ స్ట్రీట్ తేరుకుంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో మంగళవారం సూచీలు దాదాపు ఒకశాతం లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న రికవరీ ర్యాలీ కలిసొచ్చింది. క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్) తాజాగా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.3 శాతానికి పెంచింది.
ఫలితంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 66,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు బలపడి 19,690 వద్ద నిలిచింది. ఒకదశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 66,180 వద్ద, నిఫ్టీ 206 పాయింట్లు దూసుకెళ్లి 19,718 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. ఫెడ్ రిజర్వ్ అధికారుల సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు...
- ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకున్నామని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని అదానీ పోర్ట్స్, సెజ్ వివరణ ఇవ్వడంతో ఈ కంపెనీ షేరు 4% లాభపడి చేసి రూ.819 వద్ద స్థిరపడింది.
- పండుగ డిమాండ్‌తో సెప్టెంబర్ రిటైల్ అమ్మకాల్లో 20% వృద్ధి నమోదైనట్లు డీలర్ల సమాఖ్య ఫెడా ప్రకటనతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. టాటా మోటార్స్ 2%, ఎంఅండ్‌ఎం 1.50%, మారుతీ 1.32% లాభపడ్డాయి. అశోక్ లేలాండ్ 1.22%, హీరో మోటో 0.66%, బజాబ్ ఆటో 0.64%, ఐషర్ 0.42%, టీవీఎస్ 0.36% పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment