‘ఫేమ్’ దేశవ్యాప్తం చేయాలి
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్ పథకాన్ని మరిన్ని పట్టణాలకు విస్తరించాలని, అప్పుడే వాటి వినియోగం ఊపందుకుంటుందని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం కేంద్రానికి సూచిం చింది. ఆటోమొబైల్ రంగంలోకి దీర్ఘకాలం పాటు పెట్టబడులు రావడానికి, వృద్ధిని సాధించడానికి స్థిరమైన, అర్థవంతమైన నియంత్రణ విధానం కీలకమని జనరల్‌మోటార్స్ పేర్కొంది. 56వ సియామ్ వార్షికోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా ఆటోమొబైల్ రంగం ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచింది.
రోడ్ మ్యాప్ కావాలి
దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెంచాలంటే మిగిలిన పట్టణాలను కూడా ఫేమ్ పథకం పరిధిలోకి తీసుకురావాలని సియామ్ సూచించింది. ప్రస్తుతం కొన్ని పట్టణాలకే పరిమితమైన దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సియామ్ ప్రెసిడెంట్, అశోక్‌లేలాండ్ ఎండీ వినోద్‌దాసరి కోరారు. రెండేళ్ల ప్రయోగాత్మక పథకంలో ఇది రెండో సంవత్సరమని, 80వేలకు పైగా హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వాహనాలను విక్రయించగా వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన చూస్తే ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేదిలా ఉందన్నారు. ఈ పథకం కింద బైక్‌కు రూ.29వేల వరకు, కారుకు రూ.1.38 లక్షల వరకు రాయితీలు అందుకోవచ్చు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి, భద్రతను పెంచుతూ, ఇంధన సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం వెంటనే ఓ రోడ్‌మ్యాప్ తీసుకురావాలని దాసరి కోరారు.
మమ్మల్నీ గుర్తించండి...
‘ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో పరిశ్రమనూ భాగస్వామిని చేయాలి. కేవలం ఎన్జీవోలు, సామాజిక ఉద్యమకర్తలతోనే విధానాలను నిర్ణయించరాదు. తగినంత విజ్ఞానం, అనుభవం ఆధారంగా విధానాలను రూపొందించాలి’ అని టాటా మోటార్స్ సీఈవో గుంటెర్ బట్స్‌చెక్ అన్నారు.. వాహనాలను బలవంతంగా తొలగించాలా, లేక స్వచ్చందంగానా అన్నది వేచి చూడాలని అభిప్రాయపడ్డారు.
2020 నాటికి మూడో అతిపెద్ద మార్కెట్
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ 2020 నాటికి ప్ర పంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుం దని అంచనా వేస్తున్నట్టు జనరల్ మోటార్స్ ఎండీ కహేర్‌కజీమ్ తెలిపారు. అర్థవంతమైన నియంత్రిత కార్యాచరణ విధానం దీర్ఘకాలంలో పెట్టుబడులు రాబట్టడానికి, వృద్ధి చెందడానికి కీలకమన్నారు.
వాహనాల తొలగింపుపై త్వరలో ఉత్తర్వులు
వాణిజ్య వాహనాల తొలగింపు విధానానికి త్వరలోనే కేబినెట్ అనుమతి లభిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలసి ముందుకు సాగితే కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. ఈ మేరకు ఆయన సియామ్ సమావేశంలో వీడియో సందేశం వినిపించారు. ఆటోమొబైల్ రంగం ఎక్కువ మంది కార్మికులతో కూడుకున్నందున ఈ రంగానికి ప్రోత్సాహకాలతోపాటు ఎగుమతుల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. 2020 ఏప్రిల్ 1 నుంచి యూరో 6 ప్రమాణాలను అమలు చేస్తామన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్‌గీతే మాట్లాడుతూ... కాలుష్యం పెరిగిపోతున్నందున పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, అందుకే ఫేమ్ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.