పసిడి.. వెండి జిగేల్! | Silver Prices Touch $21 for First Time in 2 Years | Sakshi
Sakshi News home page

పసిడి.. వెండి జిగేల్!

Published Tue, Jul 5 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

పసిడి.. వెండి జిగేల్!

పసిడి.. వెండి జిగేల్!

ఆర్థిక అనిశ్చితి నీడన దూసుకుపోతున్న మెటల్స్...
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో పరుగు
వెండి ధర రెండేళ్ల గరిష్ట స్థాయి
దేశీ మార్కెట్‌లో ఒకేరోజు రూ.2,260 అప్

న్యూయార్క్/న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా ఇన్వెస్టర్లు పసిడి, వెండి లోహాల్ని తమ పెట్టుబడులకు సురక్షితమైనవిగా భావిస్తున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గత వారం 25 డాలర్లు పెరిగితే.. ఈ వారం మొదటిరోజు సోమవారం కూడా అదే దూకుడు ట్రెండ్ కొనసాగింది. కడపటి సమాచారం అందేసరికి పసిడి ధర ఒక శాతం కన్నా అధికంగా 15 డాలర్ల లాభంతో 1,353 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ఇంతకంటే అధికంగా దూకుడు ప్రదర్శిస్తోంది. కడపటి సమాచారం అందే సరికి 5 శాతంపైగా లాభంతో 21 డాలర్ల స్థాయిని సమీపించింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. కాగా భారత్‌లో వెండి వెలుగుకు పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల అంచనాలు సైతం ఊతం ఇస్తున్నాయి.

 దేశీయంగా...
దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్ ముంబైలో వెండి కేజీ ధర సోమవారం ఒక్కరోజు రూ.2,260 ఎగసింది. రూ.47,340 వద్ద ముగిసింది. గతవారం మొత్తంమీద ఇక్కడ వెండి ధర కేజీకి రూ.2,150 పెరిగిన సంగతి తెలిసిందే. పసిడి 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.335 చొప్పున పెరిగి  వరుసగా రూ. 31,230, రూ.31,080 వద్ద ముగిశాయి. రెండు వారాలుగా 10 గ్రాములకు దాదాపు రూ. 1,300 లాభపడిన పసిడి ముంబై స్పాట్ మార్కెట్‌లో శుక్రవారంతో ముగిసిన తాజా వారంలో స్వల్పంగా రూ.10 తగ్గింది.

 మన ఫ్యూచర్స్ మార్కెట్లో ...
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోల్చితే కడపటి సమాచారం అందే సరికి ఒకశాతంపైగా (రూ.370) లాభంతో రూ. 31,830 వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో పుత్తడి డిస్కౌంట్‌లో లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి సైతం కేజీకి  4 శాతం పైగా లాభంతో (రూ. 2,000) రూ.48,365 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే (రూపాయి కదలికలకు లోబడి) మంగళవారం స్పాట్ మార్కెట్‌లో కూడా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

కారణాలు ఇవీ...
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్)తో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు, అమెరికా వృద్ధి రికవరీలో అనుకున్నంత వేగం లేకపోవడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటును ప్రస్తుత 0.50 శాతం కన్నా ఎక్కువకు ప్రస్తుతం పెంచే అవకాశాలు లేకపోవడం వంటివి తక్షణం విలువైన మెటల్స్  మెరుపునకు కారణాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరింత ఆర్థిక  అనిశ్చితికి చోటులేకుండా... యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగే ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక అందించాలని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉన్నత స్థాయి విధాన నిర్ణేతలు బ్రిటన్‌కు శుక్రవారం విజ్ఞప్తి చేశారు.

ఆయా అంశాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఫండ్ ఎస్‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్‌లో పుత్తడి నిల్వలు శుక్రవారం 954 టన్నులకు చేరాయి. 2013 జూలై తరువాత ఈ స్థాయి ఇదే తొలిసారి.

కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో హెడ్జ్ ఫండ్స్, మనీ మేనేజర్స్ పసిడి, వెండి పట్ల తమ బుల్లిష్ పొజిషన్లను కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement