
ఏపీలో మూడు విమానాశ్రయాలకు సైటు క్లియరెన్స్
♦ గుజరాత్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు సూత్రప్రాయ ఆమోదం
♦ కేంద్ర మంత్రి మహేష్ శర్మ వెల్లడి
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన మూడు విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం సైటు క్లియరెన్సు(ఆయా ప్రాంతాల్లో గుర్తించిన స్థలాలకు అనుమతి)లను ఈ ఏడాది జనవరిలోనే మంజూరు చేసింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సైటు క్లియరెన్స్ లభించిన వాటిలో భోగాపురం(విజయనగరం), దగదర్తి(నెల్లూరు), ఓర్వకల్లు(కర్నూలు) ఉన్నాయి. రాజస్తాన్‌లోని భివాండి(అల్వార్) ఎయిర్‌పోర్టుకు కూడా ఇదే విధమైన అనుమతులు ఇచ్చినట్లు శర్మ తెలిపారు. అదేవిధంగా గుజరాత్‌లోని ధోలెరాలో మరో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. కాగా, భోగాపురంలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయి, అందుబాటులోకివస్తే... ఇప్పుడున్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మంత్రి తెలిపారు.
కేంద్రానికి కొత్తగూడెం ప్రతిపాదన...
కాగా, పలు రాష్ట్రాల్లో కొత్త విమానాశ్రయాలకు సంబంధించి తమకు ప్రతిపాదనలు వచ్చాయని శర్మ చెప్పారు. వీటిలో తెలంగాణ రాష్టంలోని కొత్తగూడెం(ఖమ్మం జిల్లా) కూడా ఉంది. ఇంకా మహారాష్ట్రలోని షోలాపూర్, బోలెరా(అమరావతి); గుజరాత్‌లోని ద్వారక, కేరళలోని అన్నాకర(ఇడుక్కి), మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, సింగ్రౌలి, ఉత్తరప్రదేశ్‌లోని జేవర్, తమిళనాడులో చింగ్లేపుట్(చెన్నై), లక్షద్వీప్‌లో అంధ్రోత్ ఈ జాబితాలో ఉన్నాయి.