బీవోబీ కేసులో ఆరుగురి అరెస్టు
ఇద్దరు బ్యాంక్ అధికారులు కూడా
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడాలో (బీవోబీ) అక్రమ రెమిటెన్సుల కేసుకు సంబంధించి సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ఆరుగురిని అరెస్టు చేశాయి. న్యూఢిల్లీలోని అశోక్ విహార్ బీవోబీ శాఖలో ఏజీఎం ఎస్‌కే గర్గ్, విదేశీ మారక విభాగం హెడ్ జైనీష్ దూబేని క్రిమినల్ కుట్ర, మోసం, అవినీతి చట్టాల కింద అరెస్టు చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగి కమల్ కల్రాతో పాటు చందన్ భాటియా, గురుచరణ్ సింగ్ ధావన్, సంజయ్ అగర్వాల్‌లను ఈడీ అరెస్టు చేసింది.
వీరిని సుదీర్ఘ సమయం పాటు ప్రశ్నించిన ఏజెన్సీలు ఆ తర్వాత అరెస్టు చేశాయి. ఇందులో అరెస్ట్ చేసిన వారంతా దాదాపు 15 నకిలీ కంపెనీల మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని వివరించాయి. బీవోబీకి చెందిన కొందరు అధికారులు 59 మంది ఖాతాదారులతో కుమ్మక్కై విదేశాలకు(ముఖ్యంగా హాంకాంగ్‌కు) రూ.6,000 కోట్ల పైచిలుకు రెమిటెన్సులు అక్రమంగా పంపారంటూ సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
రెండేళ్ల క్రితమే ఫారెక్స్ కార్యకలాపాలకు అనుమతి పొందిన బీవోబీ అశోక్ విహార్ బ్రాంచీ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. 2014 జూలై-2015 జూలై మధ్య నిధుల మళ్లింపు జరిగినట్లు తేల్చింది.
ఈ కేసులో అవినీతి కోణంలో సీబీఐ... మనీ లాండరింగ్, హవాలా కోణంలో ఈడీ విచారణ జరుపుతున్నాయి. నకిలీ కంపెనీలు ఏర్పాటు చేయడం, ఎగుమతుల విలువను ఎక్కువ చేసి చూపించి ఆ తర్వాత సుంకాలపరమైన ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడంలో కల్రా, భాటియా, ధావన్, అగర్వాల్ కుమ్మక్కై వ్యవహరించారని ఈడీ వర్గాలు తెలిపాయి. డాలరుకు 30-50 పైసల కమీషన్ మాట్లాడుకుని భాటియా, అగర్వాల్.. బీవోబీ ద్వారా రెమిటెన్సులు పంపేలా కల్రా వెసులుబాటు కల్పించినట్లు వివరించాయి.