‘స్మార్ట్’గా కొనేస్తున్నారు...! | Smartphone sales in India to cross 53 million in 2014 | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’గా కొనేస్తున్నారు...!

Published Thu, Nov 27 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

‘స్మార్ట్’గా కొనేస్తున్నారు...!

‘స్మార్ట్’గా కొనేస్తున్నారు...!

న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ దేశాల్లో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలకు సంబంధించి భారత్ జోరు కొనసాగుతోంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 82 శాతం వృద్ధితో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్ నిల్చింది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఈ వివరాలను వెల్లడించింది. మొబైల్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతుండటం, అలాగే తక్కువ వ్యవధిలోనే పాతవి మార్చేసి కొంగొత్తవి తీసుకుంటూ ఉండటం అమ్మకాల పెరుగుదలకు కారణమని పేర్కొంది. క్రిత సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 82 శాతం ఎగిసి 2.33 కోట్లకు చేరాయి. దీంతో వార్షిక ప్రాతిపదికన వరుసగా రెండో త్రైమాసికంలోను 80 శాతం పైగా వృద్ధి సాధించినట్లయిందని ఐడీసీ తెలిపింది.

క్యూ3లో మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల వాటా 32 శాతంగా నిల్చింది. క్రితం క్యూ3లో ఇది 19 శాతమే. మరోవైపు, ఫ్యాబ్లెట్ల (5.5-6.99 అంగుళాల స్క్రీన్) అమ్మకాలు ఒక మోస్తరు స్థాయికి చేరుకున్నాయని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కిరణ్ కుమార్ వివరించారు.
 4జీ సర్వీసులు వస్తుండటంతో 4.5-5.5 అంగుళాల స్క్రీన్ ఉండే స్మార్ట్‌ఫోన్లు డిమాండ్ మరింత పెరగగలదని ఆయన వివరించారు. స్మార్ట్‌ఫోన్ యూజర్లు సగటున 12-24 నెలల్లో పాతవి మార్చేసి కొత్తవి కొంటున్నారని పేర్కొన్నారు.

 2014లో 5.3 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు..
 ఇంటర్నెట్‌పై అవగాహన పెరుగుతుండటం, ఎంట్రీ లెవెల్ ఫోన్ల ధరలు తగ్గుతుండటం వంటి అంశాలతో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ ఇంకా పెరుగుతుందని మరో రీసెర్చ్ సంస్థ జీఎఫ్‌కే తెలిపింది. ఈ ఏడాది దేశీయంగా 5.3 కోట్ల పైగా స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడవుతాయని వివరించింది. మొత్తం మొబైల్స్ అమ్మకాలు 20 కోట్లకు చేరతాయని తెలిపింది. విలువ పరంగా చూస్తే మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్ రూ. 75,000 కోట్లు ఉంటుందని, ఇందులో రూ. 52,000 కోట్లు స్మార్ట్‌ఫోన్లదే ఉంటుందని పేర్కొంది. జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో 14.7 కోట్ల మొబైల్ ఫోన్స్ అమ్ముడు కాగా.. వీటిలో 3.9 కోట్లు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇక విలువపరంగా చూస్తే తొలి తొమ్మిది నెలల్లో మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్ రూ. 57,000 కోట్లు ఉంటే స్మార్ట్‌ఫోన్ల వాటా రూ. 39,000 కోట్లు.

 అగ్రస్థానంలో సామ్‌సంగ్..
 ఐడీసీ గణాంకాల ప్రకారం క్యూ3లో మొబైల్స్ తయారీ దిగ్గజం సామ్‌సంగ్ 24 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో అగ్రస్థానంలో నిల్చింది. మైక్రోమ్యాక్స్ (20శాతం), లావా..కార్బన్ (చెరి 8 శాతం), మోటరోలా (5శాతం) తర్వాత స్థానాలు దక్కించుకున్నాయి. మొత్తం మీద మూడో త్రైమాసికంలో దేశీయంగా హ్యాండ్‌సెట్స్ అమ్మకాలు 7.25 కోట్ల మేర నమోదయ్యాయి.

ఇందులో ఫీచర్ ఫోన్లు 4.92 కోట్లు. వార్షిక ప్రాతిపదికన వీటి మ్మకాలు తొమ్మిది శాతం తగ్గాయి. ఓవరాల్ మార్కెట్లో చూస్తే సామ్‌సంగ్ 16 శాతం వాటాతో అగ్రస్థానంలోనూ, మైక్రోమ్యాక్స్ (14 శాతం), నోకియా (11 శాతం), లావా (10%), కార్బన్ (8%) వాటాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక జీఎఫ్‌కే గణాంకాల ప్రకారం జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో సామ్‌సంగ్ 34.2 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో, మైక్రోమ్యాక్స్ (17.9%), నోకియా (16.3%) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement