శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా సంస్థలు ట్విటర్, స్నాప్‌చాట్ .. మరింత మంది యూజర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ట్విటర్.. ట్వీట్స్‌లో క్యారక్టర్స్ పరిమితిని యూజర్లందరికీ 280కి పెంచుతోంది. ప్రస్తుతం ఈ పరిమితి 140 క్యారక్టర్స్‌గానే ఉంది. మరోవైపు, స్నాప్‌చాట్ యూజర్లకు చేరువయ్యే విధంగా తమ యాప్ స్వరూపాన్ని మరింతగా సరళతరం చేయడంపై కసరత్తు చేస్తోంది. ఇరు కంపెనీలు ఈ మేరకు ప్రకటన చేశాయి. రెండో త్రైమాసికంతో పోలిస్తే మూడో త్రైమాసికం ఆఖరు నాటికి ట్విటర్ యూజర్ల సంఖ్య స్వల్పంగా 1 శాతం వృద్ధితో 33 కోట్లకు చేరింది. అటు స్నాప్‌చాట్ రోజువారీ యూజర్ల సంఖ్య 45 లక్షల మేర పెరిగి 17.8 కోట్లకు పెరిగింది. ఇది మూడు శాతం వృద్ధి. మరో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో పోలిస్తే ఈ రెండింటి వృద్ధి చాలా స్వల్పంగానే ఉండటం గమనార్హం. ఫేస్‌బుక్ నెలవారీ యూజర్లు 16 శాతం పెరిగి 207 కోట్లకు చేరింది.
యాప్ సరళతరం..
‘స్నాప్‌చాట్‌ను ఉపయోగించడానికి గానీ అర్థం చేసుకోవడానికి ఒకింత కష్టంగా ఉంటోందనే అభిప్రాయాలు గత కొన్నాళ్లుగా వింటున్నాం. ఈ నేపథ్యంలోనే యాప్‌ను మరింత సరళతరంగా మార్చడంపై మా టీమ్ కసరత్తు చేస్తోంది‘ అని పరిశ్రమ విశ్లేషకులతో కాన్ఫరెన్స్ కాల్‌లో స్నాప్ సీఈవో ఇవాన్ స్పీగెల్ తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలోని 13–34 ఏళ్ల యూజర్లను దాటి తమ యూజర్ బేస్‌ను మరింతగా పెంచుకోవాల్సి ఉందని వివరించారు. మూడో త్రైమాసికంలో ఆర్థిక పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు యూజర్ల సంఖ్య కూడా పెద్దగా వృద్ధి చెందని నేపథ్యంలో స్పీగెల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
280 క్యారక్టర్స్‌కి పెంపు..
ఇంగ్లీష్‌లో పోస్ట్ చేసే ట్వీట్స్‌లో దాదాపు 9 శాతం వరకూ ట్వీట్స్.. 140 క్యారక్టర్స్ పరిమితిని దాటేసేలాగా ఉంటున్నాయని గుర్తించినట్లు ట్విటర్ తెలిపింది. దీంతో యూజర్లు తమ ట్వీట్స్‌ను ఎడిట్ చేయడంపై సమయం వెచ్చించడమో లేక మొత్తానికి ట్వీట్‌నే విరమించుకోవడమో జరుగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ట్వీట్ పరిమితిని 280 క్యారక్టర్స్‌కి పెంచుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్‌లోనే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడం ప్రారంభించగా, క్యారక్టర్స్ పరిమితి పెంచడంపై యూజర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రాజెక్ట్ మేనేజర్ అలీజా రోసెన్ తెలిపారు. చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లోని ట్వీట్స్‌కి మినహా మిగతా అన్ని భాషల్లోని ట్వీట్స్‌కి ఈ పరిమితిని 280 క్యారక్టర్స్‌కి పెంచబోతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment