న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు 2–3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది. వాటాల విక్రయం ద్వారా వ్యాపార సామ్రాజ్య రుణభారాన్ని తగ్గించుకునే దిశగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘జియోలో సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేయొచ్చంటూ చాలా రోజులుగా అంచనాలు నెలకొన్నాయి. గడిచిన రెండేళ్లుగా ఇన్వెస్టర్లతో జరిపిన చర్చల్లో.. ఈ అంశం పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా వార్తలు నిజమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు ‘ అని కన్సల్టెన్సీ సంస్థ జేపీ మోర్గాన్ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, ఈక్విటీకి ఎంత విలువ కడతారు, ఈ–కామర్స్ విభాగాన్ని కూడా జియోలోనే కలిపి చూపిస్తారా, సాఫ్ట్‌బ్యాంక్ వాస్తవంగా ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అన్నవి చూడాల్సిన అంశాలని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. 10–15 బిలియన్ డాలర్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్ వ్యాపారంలో 25 శాతం వాటాలు కొనేందుకు సౌదీ అరేబియా చమురు దిగ్గజం ఆరామ్‌కో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో తాజాగా జియోలో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడుల వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జియో ఇన్ఫో కామ్‌లో వాటాల కొనుగోలు కోసం సాఫ్ట్‌బ్యాంక్‌కు చెందిన విజన్ ఫండ్ ప్రస్తుతం మదింపు ప్రక్రియ చేపట్టిందన్న వార్తలు ఈ అంచనాలకు మరింతగా ఊతమిస్తున్నాయి. 2016 సెప్టెంబర్‌లో 4జీ టెక్నా లజీ ఆధారిత టెలికం సర్వీసులతో కార్యకలాపాలు ప్రారంభించిన జియో.. రెండేళ్ల వ్యవధిలోనే దేశంలోనే మూడో అతి పెద్ద టెలికం సంస్థగా ఆవిర్భవించింది.
రిలయన్స్ రిటైల్ 35 బిలియన్ డాలర్లు..
జియో విలువ సుమారు 50 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. జియో రుణభారం అర్థవంతమైన స్థాయిలో తగ్గించుకోవాలంటే ఇన్వెస్టర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు రావాల్సి ఉంటుందని తెలిపింది. రిలయన్స్ రిటైల్ ఈక్విటీ విలువ 35 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. జియో వేల్యుయేషన్ అధిక స్థాయికి పెంచేటువంటి కొద్దిపాటి వాటాల విక్రయం వల్ల సంస్థకు అర్థవంతమైన ప్రయోజనం చేకూరకపోవచ్చని పేర్కొంది. కొత్తగా రాబోయే ఇన్వెస్ట్‌మెంట్స్.. జియోలో ఈక్విటీ పెట్టుబడుల రూపంలో ఉండాలని, ప్రతిపాదిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (ఇన్‌విట్) ద్వారా వస్తే పాక్షికంగా రుణం రూపంలో ఉన్నట్లు అవుతుందని జేపీ మోర్గాన్ వివరించింది.
33 బిలియన్ డాలర్ల రిలయన్స్ రుణ భారం..
హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణభారం (కన్సాలిడేటెడ్) 42.7 బిలియన్ డాలర్లుగా ఉంది. సవరించిన లెక్కల ప్రకారం నాలుగో త్రైమాసికం నాటికి 33.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. టెలికం కార్యకలాపాల పునర్ వ్యవస్థీకరణ ఇందుకు తోడ్పడింది. ఇందులో భాగంగా టవర్స్, ఫైబర్ అసెట్స్ కోసం రెండు వేర్వేరు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణను రెండు వేర్వేరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్టుల (ఇన్‌విట్స్)కు అప్పగించింది. అలాగే దాదాపు రూ. 70,000 కోట్ల విదేశీ రుణాలను, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రూ. 36,600 కోట్ల పెట్టుబడులను ఈ ఇన్‌విట్స్‌కు బదలాయించారు. ఈ ఇన్‌విట్స్‌లోకి వచ్చే పెట్టుబడులు, తదుపరి ఆయా రెండు అనుబం ధ సంస్థల రుణాలు తీర్చేందుకు ఉపయోగపడొచ్చని రిలయన్స్ భావిస్తోంది. ‘రాబోయే రోజుల్లో ఇన్‌విట్స్ లో వాటాలను విక్రయించడం ద్వారా ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రిలయన్స్ పెట్టుబడులు సమీకరించ వచ్చు. అదే సమయంలో ఆయా ఇన్‌విట్స్‌కు ఆదాయాలను పెంచడంపైనా దృష్టి పెడుతుంది. ఆయా అసెట్స్‌ను ఉపయోగించుకుంటున్నందుకు గాను జియో యాంకర్ టెనెంట్‌గా అద్దెలు చెల్లిస్తుం ది. అలాగే ఇతర టెలికం ఆపరేటర్లు, కస్టమర్లకు కూడా ఈ అసెట్స్‌ను అద్దెకివ్వడం ద్వారా టవర్లు, ఫైబర్ అసెట్స్ నిర్వహణకు ఏర్పాటు చేసిన అనుబం ధ సంస్థలకు ఆదాయం వస్తుంది‘ అని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. ‘ఏదైతేనేం మొత్తం మీద రుణభారం తగ్గించుకోవడం ప్రధానంగా ఉండబోతోంది. ఇందు కోసం మరిన్ని అసెట్స్‌ను విక్రయించే అవకాశం ఉంది. ఆదాయార్జన పటిష్టంగా పుంజుకుంటుం డటం, టెలికం.. రిటైల్ వ్యాపారాల భవిష్యత్తు ఈ దశాబ్దం తర్వాత కూడా పటిష్టంగా ఉంటుందన్న అంచనాలు నెలకొనడం సానుకూలాంశాలు’ అని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది.
జియోలోకి సాఫ్ట్‌బ్యాంక్ ఎంట్రీ!
Published Wed, Apr 24 2019 12:23 AM | Last Updated on Wed, Apr 24 2019 10:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment