కేబుల్‌ టీవీ విప్లవం : జియో మరో సంచలనం | Jio GigaFiber to offer broadband, landline, TV combo for Rs 600 a month | Sakshi
Sakshi News home page

బంపర్‌ ఆఫర్‌తో జియో గిగాఫైబర్‌!

Published Wed, Apr 24 2019 12:26 AM | Last Updated on Wed, Apr 24 2019 3:51 PM

Jio GigaFiber to offer broadband, landline, TV combo for Rs 600 a month - Sakshi

న్యూఢిల్లీ: టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన రిలయన్స్‌ జియో... త్వరలోనే జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి సిద్ధమవుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్‌ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌ౖ లెన్‌ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించ నుంది. ప్రస్తుతం జియో గిగాఫైబర్‌ సేవలను ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా కంపెనీ పరీక్షిస్తోంది. వన్‌టైమ్‌ డిపాజిట్‌ కింద రూటర్‌ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్‌ డేటాను 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటోంది. వచ్చే మూడు నెలల కాలంలో  బ్రాండ్‌బ్యాండ్‌కు అనుసంధానంగా టెలిఫోన్, టెలివిజన్‌ సేవలను సైతం జోడించనుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అన్ని సేవలు కూడా ఏడాది పాటు ఉచితంగా లభిస్తాయి. కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించేంత వరకు ఈ ఉచిత ఆఫర్‌ కొనసాగుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయంతో ఉంటుందని, టెలివిజన్‌ చానళ్లను ఇంటర్నెట్‌ (ఐపీటీ) ద్వారా అందించనున్నట్టు తెలిపాయి.

రూటర్‌తో 45 పరికరాల అనుసంధానం
‘‘ఈ మూడు రకాల సేవలు ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ టెర్మినల్‌ (ఓఎన్‌టీ) బాక్స్‌ రూటర్‌ ద్వారా అందించడం జరుగుతుంది. మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు తదితర 45 పరికరాలను ఈ రూటర్‌తో అనుసంధానించు కోవచ్చు’’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రూ.600 నెలవారీ ప్లాన్‌లో 600 చానల్స్‌ను ఏడు రోజుల క్యాచర్‌ ఆప్షన్‌తో ఆఫర్‌ చేస్తామని తెలిపాయి. ప్లాన్‌ చార్జీ ఆ తర్వాత రూ.1,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నాయి. తొలుత 100 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాండ్‌ బ్యాండ్‌ అందిస్తుండగా, తర్వాత ఈ వేగం 1 జీబీపీఎస్‌ వరకు పెంచే అవకాశం ఉందని తెలిపాయి. అలాగే, గిగాఫైబర్‌తో సీసీటీవీ సర్వేలెన్స్‌ వీడియోలను, ఇతర డేటాను క్లౌడ్‌లో సేవ్‌ చేసుకోవచ్చని కూడా తెలిపాయి. దేశవ్యాప్తంగా ఒకే సారి 1,100 పట్టణాల్లో జియో గిగాఫైబర్‌ను ఆరంభించనున్నట్టు గతేడాది జూన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌బ్రాండ్‌ ప్రాజెక్టును అంతర్జాతీయంగా తీసుకురానున్నట్టు చెప్పారు. మరో పోటీ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం జియోను కాపీ కొట్టకుండా దేశంలోని టాప్‌–100 పట్టణాల్లో ప్రీమియం కస్టమర్లపై దృష్టి పెట్టే ఆలోచనతో ఉందని మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు 1.82 కోట్లుగానే ఉండడం గమనార్హం. అదే సమయంలో మొబైల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ చందాదారుల సంఖ్య 53 కోట్లకు పైనే ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గతేడాది అక్టోబర్‌లో డెన్‌ నెట్‌వర్క్స్, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌లో మెజారిటీ వాటాను రూ.5,230 కోట్లతో కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన విషయం గమనార్హం. ఈ కొనుగోళ్లు జియో గిగాఫైబర్‌కు ఊతమివ్వగలవని కంపెనీ భావిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement