
ఏటీఎంకెళితే... చార్జీల మోతే!!
• ఐదు లావాదేవీల పరిమితి మళ్లీ అమల్లోకి...
• 500 నోట్లున్నాయని మూడేసి సార్లు తీస్తే అంతే
• ఐదు దాటితే లావాదేవీకి రూ.25 వరకూ చార్జీ
• ఆర్‌బీఐ నిబంధనల్నే అమలు చేస్తున్నాం: బ్యాంకులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి
నవంబర్ 8 తరవాత చాలా ఏటీఎంలలో డబ్బులే లేవు. ఇపుడిపుడే మళ్లీ కొన్ని ఏటీఎంలలోకి డబ్బులొస్తున్నాయి. దార్లో వెళుతున్న ఉపాధ్యాయుడు వి.రవీందర్... ఓ ఏటీఎం దగ్గర తక్కువ జనం ఉండటంతో తనూ డబ్బులు తీసుకోవచ్చని ఆగాడు. దాన్లో రూ.500 నోట్లున్నాయని తెలియగానే సంతోషపడి... రూ.1,500 చొప్పున మూడుసార్లు తీశాడు. ఎందుకంటే ఒకరోజు పరిమితి రూ.4,500 మాత్రమే. అంతా ఒకేసారి తీస్తే 2 వేల నోట్లు రెండు... రూ.500 ఒకటి వస్తాయి. కాబట్టి మూడుసార్లు తీశాడన్న మాట. హమ్మయ్య! అనుకుంటూ బయటపడ్డాడు. మర్నాడు కూడా అలాగే వేరే ఏటీఎంలో మూడు లావాదేవీలతో రూ.4,500 తీశాడు రవీందర్.
కానీ చివరి లావాదేవీ అయ్యేటప్పటికి... చార్జీల కింద ఖాతా నుంచి రూ.20 మినహాయించినట్లు మొబైల్‌కు మెసేజ్ వచ్చింది. ఎందుకంటే... హైదరాబాద్ సహా నాన్–మెట్రో నగరాల్లో ఎక్కడైనా ఐదుసార్లు మాత్రమే ఏటీఎంలో నగదు ఉచితంగా తీసుకోవచ్చు. నిజానికి నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసేనాటికి ఈ నిబంధన ఉండేది. కానీ కొత్త నోట్లు అందుబాటులో లేక... డిజిటల్ లావాదేవీలు అలవాటు చేయటానికంటూ 2016 డిసెంబర్ 31వరకూ ప్రభుత్వం ఈ నిబంధన సడలించింది. కానీ మళ్లీ జనవరి 1 నుంచీ ఈ నిబంధన యథాతథంగా అమల్లోకి వచ్చింది. దీనిపై బ్యాంకుల్ని ప్రశ్నిస్తే... తాము ఆర్‌బీఐ నిబంధనల్నే అమలు చేస్తున్నామని చెబుతున్నాయి. అదీ కథ.
పరిమితులున్నా కూడా అంతేనా?
పెద్దనోట్ల రద్దుకు ముందు... ఏటీఎంలో ఒకసారి రూ.40 వేల వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మెట్రో నగరాల్లో 3... హైదరాబాద్ వంటి నాన్‌మెట్రో నగరాల్లో 5 ఏటీఎం లావాదేవీలు మాత్రమే ఉచితమన్న నిబంధన పెద్దగా ఇబ్బంది కలిగించేది కాదు. ఆ పరిమితి దాటితే... లావాదేవీకి రూ.20–25 మధ్య చార్జీల రూపంలో చెల్లించాల్సి వచ్చేది. మరీ ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమయ్యే వారికే ఛార్జీలు పడేవి. అలాంటివారు బ్యాంకులకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునేవారు కూడా. దీంతో ఈ నిబంధన వల్ల పెద్దగా ఇబ్బందులుండేవి కావు. కానీ ఇపుడు రోజుకు ఏటీఎం నుంచి రూ.4,500 మాత్రమే విత్‌డ్రా చేయొచ్చనే నిబంధన ఉంది. అంతకుమించి తీయలేం. పైపెచ్చు రూ.2,000 నోట్లకు చిల్లర లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు.
బ్యాంకులకు వెళ్లినా అక్కడ నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఒకవేళ క్యాష్ ఉన్నా... రూ.2,000 నోట్లే ఇస్తున్నారు. ఇలాంటపుడు ఎక్కడైనా ఏటీఎంలో రూ.500 నోట్లున్నాయని తెలిస్తే... జనం రూ.1,500 చొప్పున విత్‌డ్రా చేయటమనేది సహజం. మరి అలా చేస్తే ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం కనక రూ.7,500 వరకే తియ్యగలరు. ఆ తరవాత ఎంత విత్‌డ్రా చేసినా ఒక లావాదేవీకి రూ.20–25 మధ్య కోత పడుతుంది. ఇదెక్కడి న్యాయం? రూ.1,500 చొప్పున పదిసార్లు విత్‌డ్రా చేసినా చేతికొచ్చేది రూ.15 వేలే. దానికి రూ.200 – 250 వరకూ చార్జీలు చెల్లించాలంటే ఇదెక్కడి ఘోరం? ఒకవైపు ఏటీఎం లావాదేవీలకు పరిమితులు... మరోవైపు ఏటీఎంలో తీసుకునే డబ్బులకు పరిమితులు... ఏ పరిమితి దాటినా చార్జీల మోత!!!? ఇలా ప్రతి ఒక్కరి జేబునూ గుల్ల చేయటమేనా డిజిటల్ లావాదేవీల లక్ష్యం? రొటీన్‌గా ఆర్‌బీఐ నిబంధనల్ని అమలు చేస్తున్నామని చెప్పే బ్యాంకులకు తమ కస్టమర్ల వెతలు పట్టవా?