సోనీ సంచలన నిర్ణయం, యూజర్ల పరిస్థితేంటి? | Sony Hangs up on India Smartphone market Focus on Other Markets | Sakshi
Sakshi News home page

సోనీ సంచలన నిర్ణయం, యూజర్ల పరిస్థితేంటి?

Published Fri, May 24 2019 2:27 PM | Last Updated on Fri, May 24 2019 2:28 PM

Sony Hangs up on India Smartphone market Focus on Other Markets - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో సోనీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది సోనీ  మొబైల్స్‌.  భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ నుంచి  వైదొలగుతున్నామంటూ సోని  జపాన్‌ ఎలక్ట్రానిక్‌ మేజర్‌ సోనీ అనూహ్యంగా ప్రకటించింది. ఇక్కడి మార్కెట్లో నష్టాలు, ఇతర లాభదాయకమైన మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించేందుకు  వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనీ తెలిపింది. 

2020ను కంపెనీకి లాభాల ఆర్థిక సంవత్సరంగా మార్చుకోవాలని సోనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం నిర్వహణ వ్యయాలను 50 శాతం వరకు తగ్గించాలని చూస్తోంది.  అలాగే 5జీసేవలను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి మేము జపాన్, యూరప్, హాంగ్‌కాంగ్, తైవాన్ దేశాల్లో మార్కెట్‌ను పెంచుకునే దిశగా అడుగులు వేస్తామని, ఇప్పటికే సెంట్రల్, సౌత్ అమెరికాలో అమ్మకాలు నిలిపివేశామని, అదే విధంగా దక్షిణాసియా దేశాల్లో పరిస్థితులను బట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తామని సోనీ తెలిపింది.

భారత స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఉన్న పోటీ మరే ఇతర మార్కెట్లలో లేదంటే అతిశయోక్తికాదు. అయితే  భారత్‌లో  చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజాల హవా భారీగా నడుస్తోంది.  వీటి దెబ్బకి  శాంసంగ్‌, యాపిల్‌ లాంటి దిగ్గజాలు కూడా వణుకుతున్న పరిస్థితి.  సోనీ లాంటి బ్రాండెడ్ కంపెనీలపై కూడా మరింత ప్రభావం పడుతోంది. ఈ పోటీలో నష్టాల పాలైన సోనీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  అంటే ఇక నుంచి భారత్‌లో సోనీ స్మార్ట్ ఫోన్లు వుండవు. 

సోనీ వినియోగదారుల పరిస్థితి ఏంటి? 
​​​​​​ఇప్పటికే తమ స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తున్న వారికి మాత్రం కంపెనీ తరఫున సేవలు అందిస్తామంటూ  దేశీయ సోనీ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది.  విక్రయాలు ఆపేసినా తమ ఫోన్లు వాడే యూజర్లకు సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్స్‌తో సహా అన్ని రకాలుగా వినియోగదారులకు అండగా ఉంటామని తెలిపింది. 

కాగా ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి నాటికి   సోనీ మొబైల్స్‌ 97.1 బిలియన్ యెన్ (879.45 డాలర్లు) నష్టపోయింది. అదే సమయంలో ఆపిల్, శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ లాభాల్లో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement