పెద్ద టీవీలకు డిమాండ్ బాగుంది | sony india 25percent growth in this year | Sakshi
Sakshi News home page

పెద్ద టీవీలకు డిమాండ్ బాగుంది

Published Tue, Oct 4 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

పెద్ద టీవీలకు డిమాండ్ బాగుంది

పెద్ద టీవీలకు డిమాండ్ బాగుంది

సోనీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ కెన్చిరో హిబి
హై ఎండ్ స్మార్ట్ ఫోన్లపై దృష్టి
ఈ ఏడాది వ్యాపారంలో 25 శాతం వృద్ధి అంచనా

సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగడంతో ఈ ఏడాది గృహోపకరణాల అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తోందని సోనీ ఇండియా పేర్కొంది. అలాగే ఇండియాలో పెద్ద అంగుళాల టీవీలకు డిమాండ్ క్రమేపీ పెరుగుతోందని చెపుతోంది. కొత్త మోడల్స్‌ను విడుదల చేయడం కంటే కొత్త టెక్నాలజీపైనే అధికంగా దృష్టి సారిస్తున్నామంటున్న సోనీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ కెన్చిరో హిబితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు....

ఈ ఏడాది అమ్మకాలు ఎలా ఉన్నాయి?
గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు బాగున్నాయి. ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి ఆరు నెలల్లో 20 శాతం వృద్ధి నమోదయ్యింది. వడ్డీరేట్లు తగ్గడం, ఏడవ వేతన సవరణ వంటి అంశాలు అమ్మకాలు పెరగడానికి దోహదం చేశాయని చెప్పవచ్చు. వచ్చే రెండు నెలల పండుగల సీజన్ దృష్టిలో పెట్టుకుంటే ఏడాది మొత్తం మీద 25 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం. కంపెనీ నిబంధనలు అనుసరించి దేశాల వారీగా అమ్మకాల విలువను చెప్పలేము. కానీ ఇండియా అమ్మకాల్లో విజయవాడ 5 శాతంతో అత్యధిక వృద్ధిని నమోదు చేస్తూ ఇండియాలోనే మొదటి స్థానంలో ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ మార్కెట్‌ను పరిశీలిస్తున్నా. ఇందులో భాగంగా విజయవాడ, రాజమండ్రి, కాకినాడ మార్కెట్ ట్రెండ్‌ను స్వయంగా పరిశీలిస్తున్నా.

వినియోగదారులు ఏ తరహా ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారు?
టెక్నాలజీ నచ్చితే ఎంత ధరకైనా కొనడానికి వెనుకాడటం లేదు. ఇప్పుడు ఇండియాలో పెద్ద పెద్ద టీవీలకు మంచి డిమాండ్ ఉంది. అలాగే సరౌండింగ్ ఆడియో సిస్టమ్స్‌కి డిమాండ్ కనిపిస్తోంది. అందుకే కొత్త మోడల్స్‌ను విడుదల చేయడం కంటే కొత్త టెక్నాలజీని పరిచయం చేయడంపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాం. అలాగే స్మార్ట్ ఫోన్లలో కేవలం హైఎండ్ రేంజ్ మీదనే దృష్టిసారిస్తున్నాం. ఫోన్లలో హైఎండ్ కెమెరా టెక్నాలజీ రావడంతో చిన్న స్థాయి డిజిటల్ కెమెరాల అమ్మకాలు తగ్గుతున్నాయి. కానీ ఇదే సమయంలో డీఎస్‌ఎల్‌ఆర్ వంటి ప్రొఫెషనల్  కెమెరాల అమ్మకాలు పెరుగుతున్నాయి.

 ఈ ఏడాది సోనీ నుంచి కొత్త ప్రొడక్టులను ఆశించవచ్చా?
బ్రావియా బ్రాండ్ నుంచి ఇంకా పెద్ద టీవీని విడుదల చేయనున్నాం. అలాగే ఆడియో సిస్టమ్‌లో కొత్త సరౌండింగ్ టెక్నాలజీ ప్రొడక్టు రానుంది. ఈ మధ్యనే విడుదల చేసిన సోనీ ఎక్స్‌పీరీయా ఎక్స్‌జెడ్‌కు మంచి స్పందన వస్తోంది.

సోనీ విస్తరణ ప్రణాళికలను వివరిస్తారా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 బ్రాండెడ్ షోరూంలున్నాయి. ఇవి కాకుండా 350 సేల్స్ కమ్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం మేము ఇంకా పూర్తిస్థాయిలో ఇండియా మొత్తం విస్తరించలేదు. డిమాండ్‌ను బట్టి అవకాశాలను పరిశీలిస్తూ విస్తరణ ప్రణాళికలను చేపడతాం. ఈ ఏడాది మార్కెటింగ్ కోసం రూ.420 కోట్లు ఖర్చు చేయనున్నాం. గతేడాది రూ. 550 కోట్లు వరకు ఖర్చు చేశాం.

 ఏపీలో యూనిట్ పెట్టే ఆలోచన ఉందా?
చెన్నైలో టీవీ అసెంబ్లింగ్ యూనిట్, నోయిడాలో పెన్‌డ్రైవ్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం వీటిని మరింతగా విస్తరించే ఆలోచన ఏమీ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయిడు  జపాన్ పర్యటన సందర్భంగా సోనీ యూనిట్‌ను సందర్శించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని కోరారు. కానీ దీని మీద ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అవకాశాలు, డిమాండ్‌ను బట్టి తయారీ కేంద్రం ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement