భారత్లో సోనీ సొంత ప్లాంటు
• మొబైళ్ల తయారీ కూడా చేపట్టే చాన్స్
• ఈ ఏడాది 20 శాతం వృద్ధి అంచనా
• సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం సోనీ సొంత తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ తమిళనాడులో థర్డ్ పార్టీకి చెందిన ప్లాంటులో ఉపకరణాలను అసెంబుల్ చేస్తోంది. సొంత ప్లాంటు ఏర్పాటుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టు సోనీ ఇండియా ఎండీ కెనిచిరో హిబి తెలిపారు. దక్షిణప్రాంత సేల్స్ మేనేజర్ జి.రాజేశ్, హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ అభిజిత్‌తో కలసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 22-55 అంగుళాల ప్యానెళ్లను ఇప్పటికే భారత్‌లో అసెంబుల్ చేస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత పెద్ద సైజు ప్యానెళ్ల అసెంబ్లింగ్ చేపడతామన్నారు. స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారీ చేసే అవకాశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. మీడియాతో ఆయనింకా ఏమన్నారంటే..
పండుగల సీజన్‌లో..
గతేడాదితో పోలిస్తే రానున్న పండుగల సీజన్‌లో అమ్మకాల్లో 40 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. మార్కెటింగ్‌కుగాను రూ.150 కోట్లు కేటాయించాం. సీజన్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై కచ్చిత బహుమతి ఉంటుంది. అన్ని విభాగాల్లోనూ కొత్త మోడళ్లు కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఎస్‌ఎల్‌ఆర్ కెమెరాలకు గిరాకీ ఏటా 20 శాతం పెరుగుతోంది. వెడ్డింగ్ మార్కెట్ ఇందుకు దోహదం చేస్తోంది. సోనీ ఆదాయం 2015-16తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. ప్రధాన మార్కెట్లలో ఒకటైన తెలుగు రాష్ట్రాల వాటా కంపెనీ ఆదాయంలో 15 శాతముంది. మాతృసంస్థకు సోనీ ఇండియా టాప్-5 మార్కెట్లలో ఒకటి. రెండు మూడేళ్లలో దీనిని టాప్-3కి తీసుకెళతాం.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్లే..
ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 90% రూ.5-10 వేల ధరలో లభించేవే. ఇన్నోవేషన్‌కు సోనీ పెట్టింది పేరు. ముఖ్యంగా కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్, కస్టమర్ల అనుభూతిలో కంపెనీ ఉత్పాదనలు ఎప్పుడూ ముందుంటాయి. పరిశోధన, అభివృద్ధికి భారీగా వ్యయం చేస్తున్నాం. అందుకే మా ఉత్పత్తులు ఖరీదైనవి. స్మార్ట్‌ఫోన్ల విషయంలో రూ.20 వేలు ఆపై విభాగంలోనే పోటీ పడతాం. ఈ సెగ్మెంట్‌లో కంపెనీ మొబైళ్లకు మంచి ఆదరణ ఉంది. ఇటీవల విడుదల చేసిన ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌కు డిమాండ్ ఉంది. ఇక ల్యాప్‌టాప్‌ల వ్యాపారం నుంచి సోనీ తప్పుకోవడం ఒక కస్టమర్‌గా చింతిస్తున్నాను.