సాక్షి, న్యూఢిల్లీ: అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస కార్యకలాపాలను మూసివేయడంతో రోడ్డునపడ్డ జెట్ ఎయిర్‌వెస్ ఉద్యోగుల విషయంలో మరో విమాన యాన సంస్థ స్పైస్ జెట్ సానుకూలంగా స్పందించింది. దాదాపు 500 మందికి ఉద్యోగాలను కల్పించినట్టు స్పైస్ జెట్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. భవిష్యత్తు నియామాకాల్లో జెట్ ఎయిర్‌వేస్ బాధిత ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడం విశేషం.
"మేము ఇప్పటికే 100 కన్నా ఎక్కువ పైలట్లకు, 200 కన్నా ఎక్కువ క్యాబిన్ సిబ్బందికి , 200మందికిపైగా టెక్నికల్, ఇతర బ్బందికి ఉద్యోగాలు కల్పించాము" అని స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. భవిష్యత్తులో మరింత మందికి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రయాణీకుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని జెట్ నిలుపుదల ద్వారా ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసేందుకు వచ్చే రెండు వారాలలో 27 విమాన సర్వీసులను అదనంగా చేర్చనున్నామని సంస్థ ప్రకటించింది.
మరోవైపు జెట్ విమానాలను నిలిపివేయడంతో విమాన సర్వీసుల క్రమబద్దీకరణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా 440 స్లాట్‌లలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (ఇండిగో) సహా స్థానిక విమానయాన సంస్థలు ప్రయోజనం పొందనున్నాయి.
కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం జెట్ వాటాల కొనుకోలుకు సంబంధించి బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. జెట్ ఎయిర్‌వేస్‌ను ఆదుకునేందుకు రుణ దాతలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఢిల్లీ, ముంబై నగరాల్లో వందలాది మంది జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని, తమను ఆదుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment