రూ.2,999కే స్పైస్‌జెట్ టికెట్
ముంబై: విమాన ప్రయాణికులపై ఆఫర్ల వర్షం జోరుగా కురుస్తూనే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే చౌక ధరల యుద్ధానికి తెర తీసిన స్పైస్‌జెట్ తాజాగా మరో ఆఫర్‌ను అందిస్తోంది. దేశీయ రూట్లలో ఒక వైపు జర్నీకి అన్ని పన్నులు కలుపుకొని చౌక ధరలకే విమాన టికెట్లనందిస్తున్నామని స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కానేశ్వరన్ ఆవ్లి చెప్పారు. ఈ టికెట్ల ధరలు రూ.2,999(అన్ని పన్నలు కలుపుకొని) నుంచే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఈ ఆఫర్‌లో బుకింగ్స్ మంగళవారం నుంచే ప్రారంభమయ్యాయని, మరో రెండు రోజులే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. వచ్చే నెల 6 నుంచి వచ్చే ఏడాది మార్చి 28 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. వయా, ఆన్‌వార్డ్ కనెక్షన్ ఫ్లైట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. టైర్-టూ నగరాల నుంచి ఎయిర్‌ట్రాఫిక్‌ను పెంచడమే ఈ ఆఫర్ వెనక ఉద్దేశమని కానేశ్వరన్ పేర్కొన్నారు.
10 నిమిషాల్లో అమ్ముడైన ఎయిర్ ఏషియా టికెట్లు
చెన్నై: ఎయిర్ ఏషియా ఇండియా తొలి విమాన సర్వీస్‌కు సంబంధించిన టికెట్లు 10 నిమిషాల్లోపే అమ్ముడయ్యాయి. తమ తొలి విమాన సర్వీస్‌ను ఈ నెల 12న బెంగళూరు నుంచి గోవాకు నడపనున్నామని ఎయిర్ ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య మంగళవారం తెలిపారు. ఈ టికెట్లు పది నిమిషాల్లోపే అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. 25 వేల ప్రొమో సీట్లను బుకింగ్స్ ప్రారంభించిన 48 గంటల్లో విక్రయించామని పేర్కొన్నారు. కాగా తొలి విమాన సర్వీస్‌కు సంబంధించిన చార్జీని రూ. 990(అన్ని పన్నులు కలుపుకొని)గా ఎయిర్ ఏషియా నిర్ణయించింది.