
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రూ.389 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఇంధన ధరలు పెరగడం, రూపాయి పతనం కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.105 కోట్ల నికర లాభం వచ్చిందని స్పైస్‌జెట్ సీఎమ్‌డీ అజయ్ సింగ్ చెప్పారు. గత క్యూ2లో రూ.1,795 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ క్యూ2లో రూ.1,848 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.2,300 కోట్లుగా ఉండగా, గత క్యూ2లో రూ.1,737 కోట్లని అజయ్ సింగ్ పేర్కొన్నారు. విమానయాన ఇంధనం ధరలు 48 శాతం, విదేశీ మారక ద్రవ్య రేటు 10 శాతం పెరగడంతో వ్యయాలు ఈ స్థాయిలో పెరిగాయని తెలిపారు. గత క్యూ2లో రూ.140 కోట్ల నిర్వహణ లాభం రాగా, ఈ క్యూ2లో రూ.322 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయని వివరించారు.
లోడ్ ఫ్యాక్టర్ ‘రికార్డ్’
ఈ క్యూ2లో రికార్డ్ స్థాయి లోడ్ ఫ్యాక్టర్, 93.5 శాతం సాధించామని అజయ్ సింగ్ తెలిపారు. మొత్తం విమానయాన రంగానికే ఈ క్యూ2 సమస్యాత్మక క్వార్టర్ అన్నారాయన. ‘‘దూకుడుగా నెట్‌వర్క్‌ను విస్తరించడం, కఠినమైన వ్యయ నియంత్రణ పద్ధతులు, ఉద్యోగుల అంకిత భావం, అధిక మైలేజీనిచ్చే విమానాలను వినియోగించడం వంటి కారణాల వల్ల ఈ క్యూ2 సమస్యలను తట్టుకోగలిగాం. విమాన చార్జీలు అధికంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగివస్తుండటం, రూపాయి పుంజుకోవటం వంటి సానుకూలాంశాల కారణంగా నిర్వహణ మరింతగా మెరుగుపడే అవకాశముంది. ఈ క్యూ3లో మరో పది బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను డెలివరీ తీసుకోనున్నాం. ఇక నాలుగో క్వార్టర్‌లో ఎనిమిది వరకూ మ్యాక్స్ విమానాలను అదనంగా అందుబాటులోకి తెస్తాం’’ అని అజయ్ సింగ్ వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేర 2.8 శాతం లాభంతో రూ.83.70 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment