విమానయాన కంపెనీల ఆఫర్ల జోరు
ప్రకటించిన ఎయిరిండియా, స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు ఉచిత టికెట్లు, చౌక ధరలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. నానాటికీ తీవ్రమవుతున్న పోటీని తట్టుకోవడానికి, సీట్ల ఆక్యుపెన్సీని పెంచుకోవడానికి వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా బుధవారం ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ కంపెనీలు ఇలాంటి ఆఫర్లనే అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్ ఇండియా బై వన్, ప్లై టూ ఆఫర్ కింద ఒక టికెట్‌ను బుక్ చేస్తే మరో టికెట్‌ను ఉచితంగా ఇస్తోంది. ఇక స్పైస్‌జెట్ సంస్థ లక్కీ సెవన్ సేల్ కింద రూ.777 ధరకే విమాన టికెట్లను (కొన్ని ఎంపిక చేసిన రూట్లలో)ఆఫర్ చేస్తోంది.
ఎయిర్ ఇండియా బై వన్ ఫ్లై టు...
గత రెండేళ్లుగా దేశీయ విమానయాన రంగం 20 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు పలు విమానయాన సంస్థలు వివిధ ఆఫర్లను ముందుకు తెస్తున్నాయి. ఎయిర్ ఇండియా కంపెనీ ఒక టికెట్‌కు మరో టికెట్‌ను ఉచితంగా ఇచ్చే బై వన్ ఫ్లై టూ ఆఫర్‌ను అందిస్తోంది. మెట్రో నగరాలకు కాకుండా దేశీయ రూట్లలో ఫస్ట్‌క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. బుకింగ్‌లు, ప్రయాణానికి కూడా గడువు మే 31 వ తేదీయే. సాధారణంగా ఈ రెండు కేటగిరిల్లో 50 శాతం సీట్లే నిండుతాయని, ఈ కేటగిరిల్లో సీట్ల ఆక్యుపెన్సీ పెంచుకోవడానికి ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు.
స్పైస్‌జెట్ లక్కీ సెవెన్ సేల్..
ఇక స్పైస్‌జెట్ సంస్థ లక్కీ సెవెన్ సేల్ ఆఫర్ కింద అన్నీ కలుపుకుని రూ.777కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ నెట్‌వర్క్‌లో ఎంపిక చేసిన రూట్లలోనే ఒక వైపుకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ నెల 25 వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని, ఈ నెల మార్చి 9 నుంచి ఏప్రిల్ 13 వరకు ప్రయాణించవచ్చని వివరించింది. విమానయాన సంస్థ డీజీసీఏ ప్రకారం, గత నెలలో 95.79 లక్షల మంది ప్రయాణికులు విమానయానం చేశారు. 25 శాతం వృద్ధి నమోదైంది.