ఇండిగో ఆఫర్ ఇదిగో..
స్పైస్ జెట్ రూ.511 ఆఫర్ అనంతరం విమానసంస్థల్లో ధరల యుద్ధం ఊపందుకుంది. స్పైస్ జెట్ కు కౌంటర్ గా భారత అతిపెద్ద విమానసంస్థ ఇండిగో సైతం అడ్వాన్స్ బుకింగ్ లపై రేట్లను తగ్గిసూ ప్రకటించింది. గుర్గావ్ కు చెందిన ఈ ఇండిగో సంస్థ దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి రూ.806కే టిక్కెట్ ధరను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. స్పైస్ జెట్ రూ.511 ఆఫర్ ను ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇండిగో ఈ ఆఫర్ ను ప్రకటించింది. జూలై 4 నుంచి సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణించే వారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుదని, మే19 వరకూ జరిగిన బుకింగ్స్ పై ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
శ్రీనగర్ నుంచి చంఢీఘర్, శ్రీనగర్ నుంచి జమ్మూ మార్గాల్లో ప్రయాణించే ప్యాసెంజర్లకు రూ.806కే టిక్కెట్ ను అందిస్తామని పేర్కొంది. ఢిల్లీ-ముంబాయి, ఢిల్లీ-కోల్ కత్తా మార్గాలకు రూ.2,668 నుంచి, ఢిల్లీ నుంచి బెంగళూరుకు రూ.3,408 ల నుంచి టిక్కెట్ ధరలుంటాయని ఇండిగో పేర్కొంది. వచ్చే వారంలో ఢిల్లీ-ముంబాయి మార్గాల్లో ప్రయాణించే వారికి మొత్తంగా రూ.4,705లకు టికెట్ ధర అందుబాటులో ఉన్నట్టు ఇండిగో వెబ్ సైట్ తెలిపింది. కానీ ఈ డిస్కౌంట్ స్కీమ్ పై ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో కంపెనీ వెల్లడించలేదు.
స్పైస్ జెట్ ఆఫర్ చేసిన రూ.511 టికెట్ పై అదనపు పన్నులను ప్యాసెంజర్లే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ మే 19తో క్లోజ్ అవుతుంది. 2016 జూన్ 15 నుంచి 2016 సెప్టెంబర్ మధ్యలో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ట్రావెల్ పరిశ్రమకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలం ఎక్కువగా డిమాండ్ ఉండే కాలం కావడంతో, ఈ ప్రమోషనల్ స్కీమ్ లను ఎయిర్ లైన్స్ ప్రకటిస్తున్నాయి. కొన్ని విదేశీ మార్గాలకు రూ.2,111 ధరనుంచి టికెట్లను స్సైస్ జెట్ ఆఫర్ చేస్తోంది.