
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవల దిగ్గజం స్పాటిఫై తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. దేశీయంగా జియోసావన్, అమెజాన్ మ్యూజిక్, గానా తదితర సంస్థలతో ఇది పోటీపడనుంది. తమ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా స్థానిక, అంతర్జాతీయ సంగీతాన్ని ఆస్వాదించవచ్చని స్పాటిఫై ఇండియా ఎండీ అమర్‌జీత్ సింగ్ బాత్రా చెప్పారు. యూజర్లు కావాలనుకుంటే నెలకు రూ. 59 చెల్లించి స్పాటిఫై ప్రీమియం సేవలకు అప్‌గ్రేడ్ కావొచ్చని వివరిం చారు.
ఐఎంఐ, ఐఎఫ్‌పీఐ నివేదిక ప్రకారం దేశీయంగా ఆడియో స్ట్రీమింగ్ వ్యాపార విభాగంలో సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఆదాయం 2017తో పోలిస్తే ప్రస్తుతం మూడింతలై రూ. 220 కోట్లకు చేరినట్లు బాత్రా పేర్కొన్నారు. స్పాటిఫైలో 4 కోట్ల పైగా భారతీయ, అంతర్జాతీయ పాటలు అందుబాటులో ఉన్నాయి. యూజర్లకు బాలీవుడ్ సహా ప్రాంతీయ పాటలు, సంగీతాన్ని అందించేందుకు జనవరిలో టి–సిరీస్ తో స్పాటిఫై ఒప్పందం కుదుర్చుకుంది. స్పాటిఫై ప్రస్తుతం 79 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.