
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్నా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగిసిన అనంతరం దిగ్గజ కంపెనీలు నియామకాలు చేపడతాయని ప్రముఖ హైరింగ్ కంపెనీ వెల్లడించింది. జూన్, జూలైలో ఉద్యోగ నియామకాల కోసం పలు కంపెనీలు తమతో సంప్రదింపులు చేపట్టాయని, ఇక ఉద్యోగాల కోతల కాలం ముగిసినట్టేనని హైరింగ్ సంస్థ క్వెస్ కార్ప్ చీఫ్ అజిత్ ఇసాక్ వెల్లడించారు. ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్ వంటి పలు రంగాల్లో నియామకాలు తిరిగి ఊపందుకుంటాయని పేర్కొన్నారు. బహుళజాతి కంపెనీలు, భారత దిగ్గజ సంస్థలు నియామక ప్రణాళికల్లో 70 శాతం మేర రిక్రూట్‌మెంట్‌ను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
అయితే ఆయా సంస్ధలు భారత శ్రామిక శక్తిలో కేవలం 15 శాతానికే పరిమితమవడంతో ఉపాధిపై పూర్ధిస్తాయి అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ భారతం నుంచి నగరాలకు వలస వచ్చిన కార్మికులు, అసంఘటిత రంగ ఉద్యోగులు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలువరు కార్మికులు పెద్దసంఖ్యలో వాహనాలు, రైళ్లతో పాటు మరికొందరు కాలిబాటనే స్వస్ధలాలకు మళ్లారు. వీరంతా లాక్‌డౌన్ అనంతరం తిరిగి నగరాలకు చేరడం పనిలో కుదురుకోవడం కొంత సంక్లిష్టమేనని చెబుతున్నారు.
చదవండి : కరోనాపై విచారణకు చైనా సై
మహానగరాల్లో డిమాండ్‌ను పునరుద్ధరించడం, వలస కూలీలను తిరిగి పనులకు రప్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని క్వెస్ కార్ప్ చీఫ్ ఇసాక్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కల్పించేందుకు పలు రాష్ట్రాలు యాజమాన్యాలు ఇష్టానుసారం ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు చేపట్టేలా కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. కార్మికులు వేధింపులకు లోనుకాకుండా సమతూకంతో కూడిన మెరుగైన కార్మిక సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment