స్టార్టప్స్‌కు మూడేళ్ల ట్యాక్స్ హాలిడే అవసరం
యువ పారిశ్రామికవేత్తలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ‘స్టార్టప్ ఇండియా’ కార్యక్రమం కింద స్టార్టప్స్‌కు 1-3 ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడేను ప్రకటించాలని యువ పారిశ్రామికవేత్తలు కోరారు. కొత్త కంపెనీల ఏర్పాటుకు సింగిల్ విండో క్లియరెన్స్ ఆవశ్యకమని తెలిపారు. భారత్ మెల్లగా విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా పయనిస్తోందన్నారు. స్టార్టప్స్‌కు ప్రాధాన్యమివ్వడం వల్ల దేశీ పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ, టైర్-2, టైర్-3 పట్టణాలు స్వయం సమృద్ధి దిశగా పయనించాలంటే, వాటిని చేయూత అవసరమని తెలిపారు.
ఆరోగ్య సంబంధిత సేవల్ని అందించే మెడికోవ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీవల ్సమ్ మీనన్ మాట్లాడుతూ.. స్టార్టప్ ఇండియా కార్యక్రమ ప్రారంభం వల్ల దేశంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుందని, స్టార్టప్ అనుకూల పరిస్థితుల ఏర్పాటు జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ రంగం, హెల్త్‌కేర్ బిజినెస్, సామాజిక-ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యకలాపాలు, గ్రామీణ ఉపాధి వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు.
ప్రభుత్వం నిబంధనలు అమలయ్యే అన్ని రంగాలు ప్రయోజనం పొందుతాయని 360రైడ్ వ్యవస్థాపకుడు, సీఈవో లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టెక్నాలజీ ఆధారిత కంపెనీల ఏర్పాటు ట్రెండ్ నడుస్తోందని ఫన్‌టూట్ సీఈవో రాజీవ్ పథక్ తెలిపారు. ప్రధాని మోదీ జనవరి 16న టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.