బ్యాంకులకు వడ్డీరేట్లు తగ్గించే వీలుంది..
ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయం
ముంబై: మరింతగా వడ్డీరేట్లు తగ్గించే అవకాశం బ్యాంకులకు ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ఏప్రిల్ 6న ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)ని ఉద్దేశించి ఆయన ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం)ను యథాతథంగా కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2015 జనవరి నుంచీ ఆర్‌బీఐ రెపో రేటును 1.75 శాతం తగ్గిస్తే– బ్యాంకులు మాత్రం కస్టమర్లకు ఈ ప్రయోజనంలో 0.85 నుంచి 90 బేసిస్ పాయింట్లను మాత్రమే బదలాయించిన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 6 మినిట్స్ సమావేశాలను ఆర్‌బీఐ గురువారం విడుదల చేసింది. ద్రవ్యోల్బణం పరమైన అడ్డంకులు వ్యవస్థలో ఉన్నాయని పటేల్ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమస్యపై కొంత జాగరూకత అవసరమన్నారు. దిగువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ వృద్ధికి ఊతం ఇచ్చినా– ద్రవ్యోల్బణం సమస్యలను కొనితెచ్చే వీలుందని పటేల్ అన్నారు. అయితే రెండింటిమధ్యా సమతౌల్యత సాధించడంపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని అన్నారు.
పీసీఏ పరిధిలోకి సగం ప్రభుత్వ బ్యాంకులు: ఫిచ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా సమీక్షించిన ‘సత్వర దిద్దుబాటు చర్యల’ (పీసీఏ) మార్గదర్శకాల పరిధిలోకి దాదాపు సగానికిపైగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వస్తాయని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ గురువారం విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది. మొండిబకాయిల సమస్య తీవ్రంగా ఉన్న బ్యాంకులకు సంబంధించి పీసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్‌బీఐ కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో ఫిచ్ ఈ అంశాలను ప్రస్తావించింది. అయితే ఈ చర్యల ద్వారా సమస్య పరిష్కారం కీలకమనీ, దీని ఆధారంగానే చర్యలు ఉంటాయని ఫిచ్ పేర్కొంది.
కఠిన చర్యలకు అవకాశం!
గతంలో ఫ్రేమ్‌వర్క్ ప్రకారం– పీసీఏ పరిధిలోకి వచ్చే బ్యాంకుకు కేవలం రుణాలు ఇవ్వవద్దన్న సూచనలను మాత్రమే ఆర్‌బీఐ చేయగలిగేది. అయితే ఇప్పుడు తాజా నిర్ణయాల ప్రకారం, చర్యల పరిధి మరింత విస్తృతమైంది. ఎటువంటి చర్యలను ఆర్‌బీఐ తీసుకుంటుదన్నదే ఇప్పుడు కీలకమని ఫిచ్ వ్యాఖ్యానించింది.