నిలబెట్టిన యూరప్
- 171 పాయింట్ల లాభంతో 25,823కు సెన్సెక్స్
- 34 పాయింట్ల లాభపడి 7,883కు నిఫ్టీ
యూరప్ మార్కెట్లు లాభాల్లో ఉండటంతో మన స్టాక్ మార్కెట్ కూడా బుధవారం లాభాల్లో ముగిసింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఇటీవల బాగా తగ్గిన రియల్టీ, బ్యాంక్ షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడం, సెప్టెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనున్న నేపథ్యంలో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 171 పాయింట్ల లాభంతో 25,823 పాయింట్లకు, నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 7,883 పాయింట్ల వద్ద ముగిశాయి. వచ్చే వారం జరగనున్న పరపతి సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. స్టాక్ సూచీలు 1 శాతం నష్టం నుంచి కోలుకున్నాయి. విద్యుత్ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
నష్టాలతో మొదలై.. లాభాల్లో ముగింపు
చైనా పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు బలహీనంగా ఉండటంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ కూడా నష్టాల్లోనే ఆరంభమైంది. కమోడిటీ ధరలు పెరిగిన కారణంగా యూరోప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడంతో మన మార్కెట్ కూడా లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 25,527 పాయింట్ల వద్ద నష్టంతో ప్రారంభమైంది. 548 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
లాభాల్లో 19 సెన్సెక్స్ షేర్లు..
30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,473 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.15,718 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,83,513 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,330 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.891 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. చైనా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆరున్నరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయినట్లు ఒక ప్రైవేట్ సర్వే వెల్లడించడంతో ఆసియా మార్కెట్లు నష్టపోయాయి. పీఎంఐ వరుసగా ఏడో నెలలో కూడా క్షీణించడంతో ఆసియా మార్కెట్లు 2.35 శాతం వరకూ పడిపోయాయి. ఆసియా మార్కెట్లు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం నెల రోజుల కాలంలో ఇదే మొదటిసారి.