మార్కెట్లో లాభాల పౌర్ణమి
మార్కెట్ అప్‌డేట్
4 రోజుల నష్టాల గ్రహణానికి చెక్
- 338 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్
- 25,369 వద్ద ముగిసిన ఇండెక్స్
- తొలగిన చమురు ధరల భయాలు
ఎట్టకేలకు స్టాక్ మార్కెట్లలో 4రోజులుగా నెలకొన్న నష్టాల గ్రహణం వీడింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు చల్లబడటంతోపాటు, ఎఫ్‌అండ్‌వో సిరీస్ ముగింపు సందర్భంగా జరిగిన షార్ట్ కవరింగ్‌తో ప్రధాన సూచీలు రివ్వున ఎగశాయి. గత 2వారాల్లో లేని విధంగా సెన్సెక్స్ 338 పాయింట్లు జంప్‌చేసి 25,369 వద్ద ముగిసింది.
లాభాలతో మొదలైన సెన్సెక్స్ మిడ్ సెషన్‌లో గరిష్టంగా 25,415కు చేరింది. నిఫ్టీ కూడా 7,593 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 87 పాయింట్ల లాభంతో 7,580 వద్ద ముగి సింది. కాగా, చైనా తయారీ రంగం ఈ ఏడాదిలో తొలిసారి (జూన్ నెలకు) వృద్ధి బాట పట్టడంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి.
అన్ని రంగాలూ..: బీఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, రియల్టీ, ఆయిల్, బ్యాంకింగ్ 3-1.5% మధ్య బలపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.6% చొప్పున పెరిగాయి. ట్రేడైన షేర్లలో 2,041 లాభపడితే, 985 నష్టపోయాయి.
ఆయిల్ షేర్ల జోష్..: ముడిచమురు ధరలుతగ్గడంతోపాటు, దేశీయంగా డీజిల్ ధరల బాటలోనే కిరోసిన్, ఎల్‌పీజీ ధరలనూ నెలవారీ స్వల్ప మొత్తంలో పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో చమురు షేర్లు హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, బీపీసీఎల్, గెయిల్, ఐవోసీ 7-5% మధ్య దూసుకెళ్లగా, ఆర్‌ఐఎల్, ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ 2-1% మధ్య లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐల పెట్టుబడులు..: ఎఫ్‌ఐఐలు రూ. 285 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీ సంస్థలు రూ. 216 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి.
మూడు కాంట్రాక్టుల్లో రూ. 3.32 లక్షల కోట్ల టర్నోవర్
- బీఎస్‌ఈలో అసాధారణ ట్రేడింగ్
- టర్నోవర్‌లో ఎక్స్ఛేంజీల కొత్త రికార్డు
మంగళవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో అసహజ స్థాయిలో టర్నోవర్ నమోదైంది. దాంతో డెరివేటివ్ విభాగంలో తొలిసారి ఎన్‌ఎస్‌ఈ(నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ)ని బీఎస్‌ఈ(బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ) ఓవర్‌టేక్ చేసింది. జూన్ నెల ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌లకు సంబంధించి బీఎస్‌ఈలో రూ. 3.36 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. ఇది ఎక్స్ఛేంజీ చరిత్రలోనే అత్యధికంకాగా, ఎన్‌ఎస్‌ఈలో దాదాపు రూ. 3.30 లక్షల కోట్లు జరిగింది. వెరసి మొత్తం టర్నోవర్ మార్కెట్ చరిత్రలోనే కొత్త రికార్డుగా రూ. 6.67 లక్షల కోట్లను తాకింది. ఈ వ్యవహారంపై సెబీ దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.
ఏం జరిగింది? డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు ప్రతీ నెలా చివరి గురువారం ముగుస్తుంది. ఎప్పుడూ డెరివేటివ్ టర్నోవర్‌లో నిఫ్టీదే అగ్రస్థానం. 80% టర్నోవర్ ఎన్‌ఎస్‌ఈలోనే జరుగుతుంటుంది. అయితే మంగళవారం బీఎస్‌ఈలో 91.6 లక్షల కాంట్రాక్ట్‌లు ట్రేడ్‌కాగా, ఒక్క ఇండెక్స్ ఆప్షన్ విభాగంలోని 3 పుట్ కాంట్రాక్ట్‌ల ద్వారానే రూ. 3.32 లక్షల కోట్ల టర్నోవర్ నమోదయ్యింది.
వీటిలో సెన్సెక్స్ 24,400 పాయింట్ల విలువగల ఒక కాంట్రాక్ట్ ద్వారా రూ. 2.06 లక్షల కోట్లు, 24,600 పాయింట్ల పుట్‌లో రూ. 1.07 లక్షల కోట్లు, 24,200 పాయింట్ల వద్ద మరో కాంట్రాక్ట్ ద్వారా రూ. 19,000 కోట్లు చొప్పున టర్నోవర్ నమోదైంది. జూన్ డెరివేటివ్స్‌లో భాగంగా బీఎస్‌ఈలో సోమవారం వరకూ సగటున రూ. 37,000-1.5లక్షల కోట్లమధ్యటర్నోవర్ జరుగుతూ వచ్చింది.