షాంఘై పతనంతో నష్టాలు
ప్రభావం చూపిన మూడీస్ జీడీపీ అంచనాల తగ్గింపు
- 47 పాయింట్ల నష్టంతో 27,832కు సెన్సెక్స్
- 11 పాయింట్లు క్షీణించి 8,467కు నిఫ్టీ
భారత జీడీపీ అంచనాలను ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 7 శాతానికి తగ్గించడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. చైనా షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ 6 శాతం పతనం కూడా తోడవడంతో వరుసగా రెండోరోజూ స్టాక్ మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 47 పాయింట్లు నష్టపోయి 27,832 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 8,467 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఇప్పటివరకూ సగటు వర్షపాతం కంటే 10 శాతం తక్కువగానే వర్షాలు కురిశాయన్న వాతావారణ శాఖ నివేదిక ప్రభావం చూపింది. ఆద్యంతం ఊగిసలాటకు గురైన ట్రేడింగ్‌లో చైనా షేర్ల పతనం కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. రూపాయి క్షీణత నేపథ్యంలో ఐటీ షేర్లు లాభాలు కొనసాగుతున్నాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు నష్టపోయాయి.
ఆగష్టు 25 నుంచి పెబ్స్ పెన్నార్ ఇష్యూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెబ్స్ పెన్నార్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 27తో ముగుస్తుంది. పూర్తి బుక్ బిల్డింగ్ విధానంలో జరిగే ఈ పబ్లిక్ ఇష్యూ ఆఫర్ ధరను రూ. 170 - 178గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కొత్తగా రూ. 58 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడంతోపాటు, 55.16 లక్షల షేర్లను విక్రయించనున్నారు.