
ముంబై: ఆర్‌బీఐ కీలక రేట్ల పెంపు తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండో రోజూ సానుకూల పవనాలే వీచాయి. ఇటీవలి కాలంలో బాగా తగ్గిన షేర్లలో కొనుగోళ్లు జరగడంతో మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఎనర్జీ, బ్యాంకింగ్ స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. స్మాల్, మిడ్ క్యాప్ కౌంటర్లలోనూ కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం గమనార్హం. ఎన్‌పీఏల వర్గీకరణకు సంబంధించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆర్‌బీఐ నిబంధనలను సరళీకరించడం స్మాల్, మిడ్‌క్యాప్‌కు కలిసొచ్చింది. స్పెక్యులేటర్ల నుంచి షార్ట్ కవరింగ్ జరగడం, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్లు ర్యాలీకి దారితీసినట్టు బ్రోకర్లు తెలిపారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 425 పాయింట్ల శ్రేణిలో ట్రేడయ్యి చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 284 పాయింట్ల లాభంతో 35,463.08 వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 83.70 పాయింట్లు పెరిగి 10,768.35 వద్ల క్లోజ్ అయింది. మే 15 తర్వాత సూచీలకు ఇవే గరిష్ఠ స్థాయిలు. అదే రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో ర్యాలీ చేయగా, తర్వాతి రోజూ ఇది కొనసాగింది. రేట్ల పెంపు ముగిసిందని, మార్కెట్ పార్టిసిపెంట్లు ఇప్పుడు వృద్ధి, ద్రవ్యోల్బణంపై దృష్టి సారించారని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు బుధవారం దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ.712 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. విదేశీ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.81 కోట్ల మేర అమ్మకాలు చేశారు.
ఆర్‌బీఐ విధానం వల్లే...
‘‘ద్రవ్యోల్బణం, వృద్ధిని సమతుల్యం చేస్తూ ఆర్‌బీఐ నెమ్మదిగా విధానాన్ని కఠినం చేస్తుండడం, మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఇటీవల బాగా తగ్గిన మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో విలువ ఆధారిత కొనుగోళ్లు జరగడంతో అవి మంచి పనితీరు చూపించాయి. రుతుపవనాల్లో పురోగతికితోడు గ్రామీణ ఆర్థికంపై సానుకూల అంచనాలు ఆర్థిక రంగానికి బలాన్నిచ్చేవి. ఇవి ఇప్పటికే ప్రభావం చూపించడం మొదలైంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment