
నాలుగో రోజూ నష్టాలే...
⇒ కొనసాగుతున్న లాభాల స్వీకరణ
⇒ ప్రభావం చూపిన యూరో మార్కెట్లు
⇒ 29,000 పాయింట దిగువకు సెన్సెక్స్..
⇒ 33 మైనస్‌తో 8,724 పాయింట్లకు నిఫ్టీ
మార్కెట్ అప్‌డేట్
వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. లాభాల స్వీకరణ (ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్, బ్యాంక్, కొన్ని వాహన షేర్లలో) కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు బుధవారం రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ కీలకమైన 29,000 స్థాయి కంటే దిగువనే ముగిసింది. ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోవడంతో రోజంతా స్టాక్ మార్కెట్లు ఊగిసలాటకు గురయ్యాయి. యూరోప్ మార్కెట్లలో ట్రేడింగ్ ప్రతికూలంగా ప్రారంభం కావడంతో చివరి అరగంటలో అమ్మకాల ఒత్తిడితో నష్టాల పాలయ్యాయి.
సెన్సెక్స్ 117 పాయింట్లు నష్టపోయి 28,883 పాయింట్ల వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 8,724 పాయింట్ల వద్ద ముగిశాయి. కన్సూమర్ డ్యూరబుల్స్,వాహన షేర్లు నష్టపోగా. లోహ, రియల్టీ, ఆరోగ్య సంరక్షణ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో 799 పాయింట్లు(2.7 శాతం) నష్టపోయింది.
ఆర్‌బీఐ రేట్ల కోత విధించకపోవడం, కంపెనీల క్యూ3 ఆర్ధిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం వంటి కారణాల వల్ల మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతున్నాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ పేర్కొన్నారు. ప్రధాన లోహాల ధరలు పెరగడం, చైనాలో మరిన్ని ప్రోత్సాహాకాలు వస్తాయన్న అంచనాలతో హిందాల్కో, టాటా స్టీల్, సెసా స్టెరిలైట్, కోల్ ఇండియా వంటి లోహ షేర్లు పెరిగాయని వెల్త్‌రేస్ సెక్యూరిటీస్ డెరైక్టర్, సీఈఓ కిరణ్ కుమార్ కవికొండల వ్యాఖ్యానించారు.
కెనరా... తీరే వేరు
దాదాపు అన్ని బ్యాంకుల క్యూ3 ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో బ్యాంక్ షేర్లు పతనమవుతున్నాయి. కానీ అంచనాలను మించిన ఫలితాలనివ్వడంతో కెనరా బ్యాంక్ షేర్ ధర పెరిగింది. అమెరికాలో జాగ్వార్ అమ్మకాలు నిరాశపరచడం, గురువారం ఆర్ధిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ 2 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో 1,557 షేర్లు నష్టాల్లో, 1,346 షేర్లు లాభాల్లో ముగిశాయి.