స్టాక్స్‌ వ్యూ | Stocks view | Sakshi
Sakshi News home page

స్టాక్స్‌ వ్యూ

Published Mon, Feb 5 2018 2:00 AM | Last Updated on Mon, Feb 5 2018 2:00 AM

Stocks view - Sakshi

పీవీఆర్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రసుత్త ధర: రూ.1,308     టార్గెట్‌ ధర: రూ.1,596

ఎందుకంటే: మల్టీప్లెక్స్‌ సినిమా హాళ్లను నిర్వహిస్తున్న పీవీఆర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ కంపెనీ రూ.618 కోట్ల ఆదాయంపై రూ.121 కోట్ల ఇబిటా, 19.7 శాతం చొప్పున ఇబిటా మార్జిన్‌ సాధిస్తుందన్న అంచనాలున్నాయి. కానీ ఆదాయం 5 శాతం మాత్రమే వృద్ధి చెంది రూ.5,57 కోట్లకు పెరిగింది. ఇబిటా 25 శాతం వృద్ధితో రూ.100 కోట్లకు ఎగసింది.  మార్జిన్‌ 3 శాతం వృద్ధితో 18 శాతానికి పెరిగింది.

అద్దె వ్యయాలు 1 శాతం తగ్గడం, నిర్వహణ, ఇతర వ్యయాలు 4.4 శాతం చొప్పున తగ్గడంతో నికర లాభం 21 శాతం వృద్ధి చెంది రూ.28.9 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ దక్షిణ భారతదేశంలో విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ క్యూ3లో ఘజియాబాద్‌లో మూడు స్క్రీన్లను ఏర్పాటు చేయగా, బెంగళూరులో 12 స్క్రీన్లను ప్రారంభించింది. ముంబైలో పీవీఆర్‌ ఓబెరాయ్‌ను మళ్లీ ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో కొత్తగా  36 స్క్రీన్లను ఏర్పాటు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మరో 31 కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నది. దీంట్లో 28 స్క్రీన్లు దక్షిణ భారత్‌లోనే ఏర్పాటు కానున్నాయి.

మొత్తం స్క్రీన్లలో ప్రస్తుతం 23 శాతంగా ఉన్న దక్షిణాది స్క్రీన్ల సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి 26.4 శాతానికి చేరుతుంది. వివిధ వివాదాల కారణంగా క్యూ3లో రిలీజ్‌ కావలసిన  పద్మావతి సినిమా క్యూ4లో రిలీజ్‌ కావడం, విడుదలై మంచి వసూళ్లను సాధించడం, మరిన్ని సినిమాలు క్యూ4లో విడుదల కానుండటంతో ఈ క్యూ4లో ఈ కంపెనీ మంచి ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్నాం. ఫుడ్‌ అండ్‌ బేవరేజేస్‌పై జీఎస్‌టీని 18% నుంచి 5 శాతానికి తగ్గించడం(ఇన్‌పుట్‌ క్రెడిట్‌ లేకుండా) సానుకూలాంశం కాగా,  పన్ను రేట్లలో మార్పులతో ఫిల్మ్‌హైర్‌ ఛార్జీలపై ప్రభావం పడనుండడం ప్రతికూలాంశం.


ఇంజినీర్స్‌ ఇండియా - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రసుత్త ధర: రూ.167         టార్గెట్‌ ధర: రూ.195

ఎందుకంటే: ప్రభుత్వ రంగంలోని ఇంజినీర్స్‌ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. వివిధ విభాగాల నుంచి ఆర్డర్లు రావడం, ఆర్డర్ల అమలు కారణంగా ఈ క్యూ3లో ఈ కంపెనీ మంచి ఆర్థిక ఫలితాలను సాధించింది. ఆదాయం 46 శాతం వృద్ధితో రూ.473 కోట్లకు పెరిగింది. దీంట్లో కన్సల్టెన్సీ విభాగం వాటా 81 శాతం ఉండగా, టర్న్‌ కీ సెగ్మెంట్‌ వాటా 19 శాతంగా ఉంది. ఈ రెండు విభాగాల్లో మంచి పనితీరు సాధించడంతో ఇబిటా మార్జిన్‌ 28.5 శాతానికి పెరిగింది.

ఇక ఇబిటా 67 శాతం వృద్ధితో రూ.135 కోట్లకు ఎగసింది. ఇబిటా మంచి వృద్ధిని సాధించినా, ఇతర ఆదాయం 30 శాతం తగ్గడంతో కంపెనీ నికర లాభం 28 శాతమే వృద్ధి చెంది రూ.108 కోట్లకు పెరిగింది. క్యూ3లో రూ.114 కోట్ల విలువైన ఆర్డర్లు మాత్రమే దక్కాయి. దీంతో ఆర్డర్ల బుక్‌ విలువ రూ.8,301 కోట్లకు పెరిగింది. ఈ ఆర్డర్లతోనే మూడేళ్ల వరకూ మంచి వృద్ధిని సాధించే అవకాశాలు ఈ కంపెనీకి ఉన్నాయి. అయితే రెండేళ్లలో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నుంచే భారీ ఆర్డర్లు రానున్నాయి.

రూ.700–1,200 కోట్ల హెచ్‌పీసీఎల్‌ బామర్‌ ప్రాజెక్ట్, రూ.600 కోట్ల ఐఓసీ గుజరాత్‌ రిఫైనరీ విస్తరణకు సంబంధించిన కన్సల్టెన్సీ ఆర్డర్‌ ఈ కంపెనీకే దక్కనున్నాయి. అంతేకాకుండా ఐఓసీకే చెందిన కోయాలి, బరౌని, మధుర రిఫైనరీల విస్తరణ ఆర్డర్లు వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో ఇంజినీర్స్‌ ఇండియాకే లభించవచ్చు. గెయిల్‌–కాకినాడ పెట్రో కెమికల్‌ ప్రాజెక్ట్, బీపీసీఎల్‌–నుమాలీఘర్‌ విస్తరణ ప్రాజెక్ట్‌ ఆర్డర్లు కూడా ఈ కంపెనీకి దక్క అవకాశాలున్నాయి.  కంపెనీ నగదు నిల్వలు రూ.2,150 కోట్లు. రుణభారం లేదు.  రెండేళ్లలో ఇబిటా మార్జిన్‌ 25 శాతం, నికర అమ్మకాలు 18 శాతం, నికర లాభం 14 శాతం  చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement