పేజ్ ఇండస్ట్రీస్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత ధర: రూ.21,451
టార్గెట్ ధర: రూ.27,490
ఈ కంపెనీ పురుషుల, మహిళల లోదుస్తులు, స్పోర్ట్స్ వేర్‌లను అందిస్తోంది. ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్స్(ఈబీఓ)లను వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలోనే 80కు పైగా ఈబీఓలను ప్రారంభించనున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 500 ఈబీఓలను అందుబాటులోకి తేనున్నది. గత ఏడాది మార్చి నాటికి 360గా ఉన్న ఈబీఏలను వచ్చే ఏడాది మార్చి కల్లా 1,000 కు పెంచాలనేది కంపెనీ లక్ష్యం. ఈ ఈబీఏల ఏర్పాటు ఇటు కంపెనీకి, అటు ప్రాంఛైజీ సంస్థలకు కూడా ప్రయోజనకరమైనదే. ఇంత భారీగా ఈబీఓల విస్తరణ....అమ్మకాల వృద్ధి పట్ల ప్రాంచైజీలకు, కంపెనీకి గల ధీమాను సూచిస్తోంది.
మొత్తం అమ్మకాల్లో ఈబీఓల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంగా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 40 శాతంగా ఉండనున్నది. 2017–20 కాలానికి రూ.200 కోట్ల మేర పెట్టుబడులు పెడుతోంది. మూలధన ప్రణాళికల్లో భాగంగా అనంతపురం, ఓడిశాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 16–17 శాతంగా ఉన్న అవుట్ సోర్సింగ్ మాన్యుఫాక్చరింగ్ వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా 35 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి. డిమాండ్ బాగా ఉండడమే దీనికి కారణం.
డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను ప్రతి ఏడాది 10 శాతం చొప్పున పెంచుతోంది. ఈ కంపెనీ ఉత్పత్తులకు పోటీ చాలా తక్కువగా ఉంది. వ్యాన్ హ్యూసెన్ కంపెనీ ఉత్పత్తులు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మొత్తం అమ్మకాలు 2.6 శాతంగా ఉన్న ఆన్‌లైన్ అమ్మకాలు మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. ఆర్థిక స్థితిగతుల పరంగా ట్రాక్‌రికార్డ్ చాలా బాగా ఉంది. వృద్ది, ఈపీఎస్ ప్రతి ఏడాదీ 15 శాతం కంటే ఎప్పుడూ తక్కువ వృద్ధి సాధించలేదు.
రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్(ఆర్‌ఓసీఈ) 40 శాతంగా ఉంది. ఇప్పటిదాకా మహిళ, పురుషుల లో దుస్తులను మాత్రమే అందిస్తూ వచ్చిన కంపెనీ తాజాగా పిల్లల లోదుస్తుల రంగంలోకి కూడా ప్రవేశించింది. గత ఏడాది రంగ మార్కెట్లోకి తెచ్చిన బాలుర లో దుస్తులకు మంచి స్పందన లభించింది. ఇక ఈఏడాది బాలికల లోదుస్తుల సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించనున్నది.
బ్రిటానియా ఇండస్ట్రీస్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డైరెక్ట్
ప్రస్తుత ధర: రూ.4,840
టార్గెట్ ధర: రూ.5,300
ఈ కంపెనీ బిస్కెట్లు, బ్రెడ్‌లు, డైరీ ఉత్పత్తులు, కేక్‌లను అందిస్తోంది. కొత్త ఉత్పత్తుల జోరును పెంచుతోంది. పూర్తి ఫుడ్ కంపెనీగా మారే క్రమంలో ఈ ఆర్థిక సంవత్సంరో 50కు పైగా కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నది. ఇప్పుడున్న సెగ్మెంట్లతో పాటు కొత్త సెగ్మెంట్లలో కూడా కొత్త ఉత్పత్తులను అందించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర అమ్మకాలు 13 శాతం, ఇబిటా 27 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున వృద్ధి చెందాయి. పన్ను రేటు 33.7 శాతంగా ఉండటంతో నికర లాభం 20 శాతమే వృద్ధి చెందింది. స్థూల మార్జిన్లు 38.5 శాతంగా, ఇబిటా మార్జిన్ 15.5 శాతంగా ఉన్నాయి.
కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా అంతర్జాతీయ అమ్మకాలు అంతంతమాత్రంగా ఉండగా, దేశీయ అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. బిస్కెట్ కేటగిరీ అమ్మకాలు ఊపందుకుంటాయని కంపెనీ అంచనా వేస్తోంది. రానున్న క్వార్టర్లలో ఈ సెగ్మెంట్ అమ్మకాలు 9–10 శాతం వృద్ధి సాధించగలదని కంపెనీ భావిస్తోంది. ఈ క్యూ3లో ఉత్పత్తి వ్యయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఉత్పత్తి వ్యయాలు 3–3.5 శాతం రేంజ్‌లో పెరగగలవని కంపెనీ భావిస్తోంది.
నెట్‌వర్క్ విస్తరణ, కొత్త, భారీ ఫ్యాక్టరీల ఏర్పాటు, వృధా తగ్గించడం, వేల్యూ ఇంజినీరింగ్ వంటి చర్యల కారణంగా మొత్తం రూ.230 కోట్లు కంపెనీకి ఆదా అయ్యాయి. ట్రీట్ పేరుతో అందిస్తోన్న క్రీమ్ బిస్కెట్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. గుడ్‌డే, మేరీ గోల్డ్, టైగర్ 50:50 న్యూట్రి చాయిస్ బ్రాండ్ల మాదిరే ట్రీట్ కూడా పవర్ బ్రాండ్‌గా మారగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం రూ.400 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం స్థాయిని ఐదేళ్లలో నాలుగు రెట్లకు రూ.1,500 కోట్లకు పెంచుకోవాలనేది కంపెనీ లక్ష్యం.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment