టాటా స్టీల్ - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ప్రస్తుత ధర: రూ..554 టార్గెట్ ధర: రూ.903
ఎందుకంటే: 1907లో ఆరంభమైన ఈ కంపెనీ ఆసియాలోనే తొలి ఉక్కు ఫ్యాక్టరీ, భారత్‌లో రెండో అతి పెద్ద స్టీల్ కంపెనీ. యూరప్‌లోని కోరస్ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద ఆరో స్టీల్ కంపెనీగా అవతరించింది. తక్కువ ఖర్చుతో ఉక్కును తయారు చేసే కొన్ని ఉక్కు కంపెనీల్లో ఇది ఒకటి. చైనాలో ఉక్కు ప్లాంట్లలో ఉత్పత్తి సామర్థ్య విస్తరణపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు కంపెనీలకు ప్రయోజనం కలిగించే అంశమే. టాటా స్టీల్‌కు ఒడిశాలోని కళింగనగర్ ప్లాంట్ ఇటీవలనే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఒక్కో టన్ను ఉక్కు ఉత్పత్తిపై రూ.10,000–11,000 నిర్వహణ లాభం వస్తుందని అంచనా.
అనేక అనిశ్చితిలకు ముగింపు పెడుతూ థిసన్‌క్రప్ యూరప్ కార్యకలాపాలు టాటా స్టీల్ యూరప్ కార్యకలాపాల విభాగంలో విలీనమవుతున్నాయి. ఈ విలీనంపై ఇప్పటిదాకా నీలినీడలు కమ్ముకోవడంతో గత కొన్ని వారాలుగా ఈ షేర్ క్షీణిస్తూ వస్తోంది. టాటా స్టీల్, థిసన్‌క్రప్ కంపెనీల యూరప్ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్‌లో టాటా స్టీల్‌యూరప్‌కు చెందిన 250 కోట్ల యూరోల రుణ భారాన్ని బదిలీ చేసే అంశంపై అనిశ్చితి నెలకొన్నది. అయితే ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్నే ఇరు సంస్థలు ఖరారు చేశాయి.
ఈ విలీనం వల్ల 40–50 కోట్ల యూరోల ప్రయోజనం లభిస్తుందని టాటా స్టీల్ అంచనా వేస్తోంది. ఈ విలీనం వల్ల ఏర్పడే థిసన్‌క్రప్ టాటా స్టీల్ జేవీ యూరోప్ ఉక్కు మార్కెట్లో రెండో అతి పెద్ద కంపెనీగా అవతరిస్తుంది. మరోవైపు థిసన్‌క్రప్ కంపెనీ 400 కోట్ల యూరోల విలువైన ఆస్తులను ఈ జేవీకి బదిలీ చేస్తుంది. యూరప్ కార్యకలాపాల విషయానికొస్తే, ఉద్యోగుల పింఛన్ సంబంధిత సమస్యలు పరిష్కారం కానున్నాయి. పునర్వ్యస్థీకరణ ప్రయత్నాలు ఫలాలనివ్వనున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, చైనా నుంచి సరఫరాల అంచనాలు మారడం.. ప్రతికూలాంశాలు.
బాటా ఇండియా - కొనొచ్చు
బ్రోకరేజ్ సంస్థ: ఎస్‌బీఐక్యాప్ సెక్యూరిటీస్
ప్రస్తుత ధర: రూ.830
టార్గెట్ ధర: రూ.871
ఎందుకంటే: ప్రపంచంలో రెండో అతి పెద్ద ఫుట్‌వేర్ మార్కెట్‌గా భారత్ నిలుస్తోంది. భారత ఫుట్‌వేర్ మార్కెట్లో అతి పెద్ద రిటైల్ కంపెనీగా బాటా ఇండియా అవతరించింది. భారత్‌లో వార్షిక పాదరక్షల ఉత్పత్తి ప్రస్తుతం 250 కోట్ల జతలుగా ఉంది. ఈ ఉత్పత్తి మరో రెండేళ్లలో 400 కోట్ల జతలకు పెరగవచ్చని అంచనా. బాటా కంపెనీ స్టోర్స్ అమ్మకాలు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. మరోవైపు కొత్తగా స్టోర్స్‌ను విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. చిన్న నగరాల్లో కొత్త స్టోర్స్ ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది.
ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 7 శాతం వృద్ధితో 632 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 22 శాతం వృద్ధితో రూ.82 కోట్లకు, నికర లాభం 45 శాతం వృద్ధితో రూ.52 కోట్లకు ఎగిశాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.2,634 కోట్లకు, నిర్వహణ లాభం 26 శాతం వృద్ధితో రూ.351 కోట్లకు, నికర లాభం 39 శాతం వృద్ధితో రూ.220 కోట్లకు పెరిగాయి.
ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో పటిష్టంగా ఉండటం, కొత్త ప్రచార కార్యకలాపాలు, స్టోర్స్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా అమ్మకాలు పెంచుకునే పటిష్టమైన మార్కెటింగ్ ప్రయత్నాలు, విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం, వ్యయ నియంత్రణ పద్ధతుల వల్ల నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందింది. గత ఐదేళ్లలో కంపెనీ ఆదాయం 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. ఎలాంటి రుణభారం లేని ఈ కంపెనీ రాబడి నిష్పత్తులు పటిష్టంగా ఉన్నాయి.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment