స్టాక్స్ వ్యూ | Stocks View | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Jun 15 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

Stocks View

నెస్లే ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్‌వేజ్  ప్రస్తుత ధర: రూ.6,087  టార్గెట్ ధర: రూ.5,614
ఎందుకంటే:
కంపెనీకి చెందిన కీలకమైన బ్రాండ్ మ్యాగీ వివాదంలో చిక్కుకుంది. మ్యాగీలో పరిమితికి మించి సీసం, ఎంఎస్‌జీలు ఉన్నాయంటూ దుమారం రేగుతోంది. కేరళ ప్రభుత్వం ఇప్పటికే దీనిని నిషేధించింది. మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బిగ్‌బజార్‌ను నిర్వహిస్తున్న ఫ్యూచర్ గ్రూప్ మ్యాగీ అమ్మకాలు నిలిపేయాలని నిర్ణయించింది. ఈ వివాదం కారణంగా మ్యాగీ అమ్మకాలు తగ్గాయి. నెస్లే ఇండియా మొత్తం ఆదాయంలో మ్యాగీ వంటి ప్రిపేర్డ్ డిషెస్ సెగ్మెంట్ వాటా 30 శాతంగా ఉంది. వీటిల్లోనూ మ్యాగీ వాటానే అధికం. వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తాయన్న అంచనాలు ఎఫ్‌ఎంసీజీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. మ్యాగీ సురక్షితమైనదేనని, ప్రచారం చేయడానికి కంపెనీ భారీ సంఖ్యలో మార్కెటింగ్ వ్యయాలు భరించాల్సి ఉంటుంది. న్యాయ స్థానాల్లో న్యాయపోరాటానికి భారీగానే వ్యయం చేయాల్సి రావచ్చు. ఇవన్నీ కంపెనీ లాభదాయకతపై ప్రభావం చూపవచ్చు. మ్యాగీ వివాదం  నెస్లే ఇతర బ్రాండ్లపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటి కారణంగా ఈ కంపెనీ షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్)  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం చొప్పున తగ్గగలదని అంచనా వేస్తున్నాం.
 
పవర్ గ్రిడ్
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్  ప్రస్తుత ధర: రూ.145  టార్గెట్ ధర: రూ.165

ఎందుకంటే: ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ ప్రసార కంపెనీల్లో ఒకటి. 2013-14 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,962 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో  రూ.4,703 కోట్లకు, నికర లాభం రూ.1,175 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.1,412 కోట్లకు పెరిగాయి. ఇబిటా 19 శాతం వృద్ధి చెందింది.  అలాగే షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) రూ.2.25 నుంచి రూ.2.7కు పెరిగింది. షేర్ వారీ ఆర్జన వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11గా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.12గా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో నికర అమ్మకాలు 13 శాతం, నికర లాభం 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించవచ్చని అంచనా వేస్తున్నాం. కంపెనీకి భారీగా మిగులు నిధులున్నాయి. ఇదే జోరు మరో మూడేళ్ల వరకూ కొనసాగవచ్చు. ప్రభుత్వ రంగ ఈ నవరత్న కంపెనీ పవర్‌టెల్ పేరుతో టెలికాం వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వింధ్యాచల్ జబల్‌పూర్ ట్రాన్సిమిషన్ కంపెనీని కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో మెగా సోలార్ పార్క్‌ను రూ.312 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తోంది.
 
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
బ్రోకరేజ్ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్  ప్రస్తుత ధర: రూ.174

టార్గెట్ ధర: రూ.287  ఎందుకంటే: పదవ ద్వైపాక్షిక వేతన సెటిల్మెంట్ కారణంగా 2013-14లో రూ.వంద కోట్లుగా ఉన్న వేతన కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరంలో రూ.310 కోట్లకు పెరిగాయి. ఇంకా ఇతర కేటాయింపులు మొత్తం 800 కోట్లకు చేరాయి. ఇది స్థూల లాభంలో 87 శాతానికి సమానం. అయితే ట్రెజరీ ఆదాయం 610 కోట్లకు పెరగడం, తక్కువ పన్ను రేటు కొంత ఊరటనిచ్చాయి. 2011-15 మధ్యకాలంలో కొత్తగా 630 బ్రాంచీలను ఏర్పాటు చేసినప్పటికీ, బ్రాంచి వారీ సగటు ఆర్జనలో పెద్దగా మార్పులేదు. వ్యవసాయ రంగంలో మినహా దాదాపు అన్ని రంగాల్లోనూ మొండి బకాయిలు పెరిగాయి. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం బ్యాంక్ పనితీరు బాగా లేదు. రిటర్న్ ఆన్ అసెట్ 30 బేసిస్ పాయింట్లు తగ్గింది. రుణ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. కొత్తగా పగ్గాలు చేపట్టిన ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నాం. టైర్-వన్ పెట్టుబడులు సంతృప్తికరమైన స్థాయిలోనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కుదుటపడితే లాభపడనున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి కానున్నది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement