
న్యూఢిల్లీ: వేతనాలు స్వల్పంగా పెంచుతామని బ్యాంకులు చేసిన ప్రతిపాదనను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెతో తొలి రోజు బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగింది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఇటు నెలాఖరు, అటు వేతనాల సమయం కూడా కావడంతో విత్‌డ్రాయల్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడింది. పలు చోట్ల ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ప్రతిపాదించిన 2 శాతం వేతనాల పెంపును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగటం తెలిసిందే. గురువారం కూడా ఇది కొనసాగనుంది. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 13 పాత తరం ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆరు విదేశీ బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఒక ప్రకటనలో తెలిపింది. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దేశవ్యాప్తంగా 85,000 పైచిలుకు శాఖలు ఉన్నాయి. బ్యాంకింగ్ లావాదేవీల పరిమాణంలో 70 శాతం వాటా వీటిదే ఉంటోంది.
స్వల్ప పెంపు అవమానించడమే..
2012 నాటి వేతన సవరణలో 15% మేర పెంచగా.. తాజాగా రెండు శాతమే ఇస్తామనడం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులను అవమానించడమేనని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) జాయింట్ జనరల్ సెక్రటరీ రవీందర్ గుప్తా వ్యాఖ్యానించారు. దీంతో రెండు రోజుల వేతనాన్ని వదులుకుని మరీ సమ్మెకు దిగడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందన్నారు. నోట్ల రద్దు మొదలుకుని ముద్ర, జనధన యోజన మొదలైన ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని, కానీ దానికి ప్రతిఫలంగా రెండు శాతమే వేతనాల పెంపు అనేది కష్టించి పనిచేసిన వారికి తీవ్ర అన్యాయం చేయడమేనని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు.
ప్రైవేట్ బ్యాంకింగ్ యథాతథం..
సమ్మెతో డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్స్ రెన్యువల్స్, ప్రభుత్వ ట్రెజరీ కార్యకలాపాలు, మనీ మార్కెట్ లావాదేవీలు దెబ్బతిన్నాయి. ఆర్‌టీజీఎస్ మొదలైన సాధనాల రూపంలో కొంత మేర డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి. మొత్తం బ్యాంకింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీల వాటా 5 శాతం ఉంటాయని పేర్కొన్నాయి. అటు, కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు మొదలైనవి యథాప్రకారం పనిచేశాయి. చెక్కుల క్లియరెన్స్ వంటి కొన్ని లావాదేవీలపై మాత్రం ప్రభావం పడింది.
రూ. 20వేల కోట్ల లావాదేవీలకు విఘాతం..
బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో దాదాపు రూ.20,000 కోట్ల విలువైన లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు పరిశ్రమల సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. సమ్మెను విరమించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ)ని కోరింది. మరోవైపు, మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును మెరుగుపర్చేందుకు తగు ప్రణాళికను రూపొందించాలని అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment