బేటీ కోసం..భలే పథకం | study for women | Sakshi
Sakshi News home page

బేటీ కోసం..భలే పథకం

Published Sun, Feb 8 2015 12:36 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

బేటీ కోసం..భలే పథకం - Sakshi

బేటీ కోసం..భలే పథకం

అమ్మాయి చదువు, పెళ్లి కోసం ‘సుకన్య సమృద్ధి’
9.1% వడ్డీ... సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు   
10 ఏళ్ల లోపు బాలికలకు కేంద్రం ప్రత్యేక పథకం
దగ్గర్లోని పోస్టాఫీసు, బ్యాంకుల్లో తెరిచే సదుపాయం   
కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికలకే వర్తింపు

 
‘ అమ్మాయిల సంరక్షణ, అమ్మాయిల చదువు (బేటీ బచావో.. బేటీ పడావో)’  నినాదంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమ్మాయిల కోసం  కిందటి నెలలో సరికొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉన్నత చదువు, పెళ్లి వంటి ఖర్చులకు అక్కరకు వచ్చేలా తీర్చిదిద్దిన ఈ పథకానికి ‘సుకన్య సమృద్ధి’ అని పేరు పెట్టారు. ఈ దీర్ఘకాలిక డిపాజిట్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తంపై అత్యధిక వడ్డీరేటుతో పాటు, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కల్పించడం ఈ పథకంలోని ప్రధాన ఆకర్షణ. పలు ప్రయోజనాలను అందిస్తున్న సుకన్య సమృద్ధి  పూర్తి వివరాలివీ...
 
 పెరుగుతున్న విద్యా, వివాహ వ్యయాలను దృష్టిలో పెట్టుకొని అమ్మాయిల కోసం గత నెల 21 నుంచి సుకన్య సమృద్ధి పథకాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్యాక్స్ సేవింగ్ పథకాల్లో అత్యధిక కాలపరిమితి కలిగిన పథకమిదే. ఇంతవరకు ఈ రికార్డు 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పేరున ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును తిరగ రాయడమే కాకుండా అధిక వడ్డీ రేటును అందిస్తున్న పథకమిదే. ఇప్పటి వరకు పోస్టాఫీసు అందించే 10 ఏళ్ల నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ అందిస్తున్న 8.8 శాతం వడ్డీరేటు మొదటి స్థానంలో ఉండగా, సుకన్య సమృద్ధి ఏకంగా 9.1 శాతం వడ్డీని అందిస్తోంది.
 
 ఎవరు ప్రారంభించొచ్చు?
 అమ్మాయిల పేరు మీద సంరక్షకులు అకౌంట్ తెరవొచ్చు. ఒక అమ్మాయి పేరు మీద ఒక ఖాతా మాత్రమే తెరవగలరు. ఇలా గరిష్టంగా ఇద్దరు పిల్లల పేరిట ఖాతాలు తెరవొచ్చు. ఒకేవేళ ట్విన్స్, ట్రిప్లెట్స్ ఉంటే మాత్రం మూడో వారి పేరు మీద కూడా ఖాతా తెరవడానికి అనుమతిస్తారు. ఇక్కడ సంరక్షకులు అంటే తల్లిదండ్రులు, వారు లేకపోతే చట్టపరంగా వారి సంరక్షణను చూసే వారికీ వర్తిస్తుంది. అమ్మాయికి 10 ఏళ్ల దాటిన తర్వాత ఈ ఖాతాను స్వయంగా నిర్వహించుకోవచ్చు.
 
 వయో పరిమితి నిబంధనలు...
 అప్పుడే పుట్టిన అమ్మాయిల నుంచి 10 ఏళ్ల లోపు అమ్మాయిల పేరిట సంరక్షకులు ఈ ఖాతా ప్రారంభించొచ్చు. కానీ ఇప్పుడే ఆరంభించారు కనక ఈ ఏడాది ఒక సంవత్సరం మినహాయింపు ఇచ్చారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తేదీ డిసెంబర్ 12, 2014 నాటికి పదేళ్లు నిండిన వారికి ఒక సంవత్సరం మినహాయింపు ఇచ్చారు. అంటే ఈ ఏడాది 11వ ఏడు వచ్చిన వాళ్లు కూడా ప్రారంభించొచ్చు.
 
 పథకం కాలపరిమితి ఎంత?
 ప్రారంభించిన తర్వాత వరుసగా 14 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలి. మెచ్యూర్టీ మాత్రం పథకం ప్రారంభించిన 21 ఏళ్లకు అవుతుంది. లేనిపక్షంలో అమ్మాయికి పెళ్లి జరిగితే ఆ తేదీయే మెచ్యూరిటీ తేదీ అవుతుంది. ఈ రెండింటిలో ఏది ముందైతే దానికి మెచ్యూరిటీ వర్తిస్తుంది. వివాహం సందర్భంగా అమ్మాయి వయసు 18 ఏళ్లు నిండినట్లు అఫిడవిట్ ఇవ్వాలి. అమ్మాయికి 18 ఏళ్లు దాటితే ఉన్నత చదువుల కోసం గరిష్టంగా 50 శాతం వెనక్కి తీసుకోవడానికి ఈ పథకం అనుమతిస్తోంది.
 
 ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
 కనీసం ఏడాదికి రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలి. ఆపైన రూ.100 గుణిజాల్లో ఏడాదిలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీస ఇన్వెస్ట్‌మెంట్ నిబంధన చేరుకోకపోతే ఏడాదికి రూ.50 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే 14 ఏళ్ల ఇన్వెస్ట్‌మెంట్ కాలపరిమితిలో మధ్యలో ఏ ఏడాది అయినా కనీసం రూ. 1,000 చెల్లించలేకపోతే అపరాధ రుసుం చెల్లించాలి. ఈ మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ రూపంలోనే చేయాల్సి ఉంది. ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం లేదు.
 
ఎంత వడ్డీ వస్తుందేంటి?
 ఈ పథకంపై స్థిరమైన వడ్డీరేటు ఉండదు. ఇది ప్రతి ఏటా మారుతుంది. ప్రస్తుత ఏడాదికి 9.10 శాతం వడ్డీని కేంద్రం ప్రకటించింది.

కాగితాలు ఏం కావాలి?
 సాధారణంగా బ్యాంకు ఖాతా తెరవడానికి ఇచ్చే వ్యక్తిగత, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు పుట్టిన తేదీని ధ్రువపర్చే కాగితాలు ఇస్తే సరిపోతుంది.
 
 ఎక్కడ లభిస్తోంది?
 పోస్టాఫీసుల్లో, కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ బ్రాంచీల్లో సుకన్య సమృద్ధి అందుబాటులో ఉంది.
 పన్ను ప్రయోజనాలేంటి?
 ఏటా ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తం మీద గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు సెక్షన్ 80సీ ప్రయోజనాలు పొందొచ్చు. జనవరి 21 తర్వాత ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఈ ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఈ పథకంపై వచ్చే వడ్డీ మాత్రం ఆదాయంగా పరిగణిస్తారు. మెచ్యూర్టీగా అందుకునే మొత్తంపై మాత్రం స్పష్టత లేదు.              
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement