వడ్డీ రేట్లలో కోత ఉంటుందా..?
♦ ఆర్‌బీఐ విధానంపై మిశ్రమ అంచనాలు
♦ రాజన్‌కు ఇదే చివరి సమీక్ష
న్యూఢిల్లీ : ఆర్‌బీఐ మంగళవారం నాటి పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో మార్కెట్, పారిశ్రామిక, బ్యాంకింగ్ వర్గాలు మరోసారి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చని కొంతమంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. వర్షపాతం ప్రభావాన్ని పూర్తిగా పరిశీలించి గానీ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోదని వారు భావిస్తున్నారు. అయితే కొన్ని సానుకూల కారణాల వల్ల వడ్డీ రేట్ల తగ్గుదలకు అవకాశం వుందని మరికొందరు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. గవర్నర్‌గా రఘురామ్ రాజన్‌కు ఇదే చివరి సమీక్ష కానుంది. సెప్టెంబర్ 4న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అలాగే పాలసీ నిర్ణయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ స్వతంత్రంగా తీసుకోబోయే చివరి సమీక్షా సమావేశం కూడా ఇదే. తదుపరి సమీక్ష అక్టోబర్ 4 నాటికి వడ్డీ రేట్ల నిర్ణయానికి కేంద్రం తీసుకొచ్చిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ తన పని ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయడంపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తుందని ఆశిస్తున్నట్టు కేంద్రం గత వారమే ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజన్ దేవుడు... నేను దెయ్యమా..?
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి రాజన్‌ను టార్గెట్ చేశారు. మీడియాను కూడా విడిచిపెట్టలేదు. రాజన్‌ను దేవుడిగా, తనను దెయ్యంగా మీడియా చిత్రీకరించిందని విమర్శించారు. ‘రాజన్ వెళితే స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయని మీడియా చెప్పింది. కానీ మార్కెట్లు ఏమీ కుప్పకూలడం లేదు. పైగా పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లను పెంచుతూ ఆర్థిక వ్యవస్థకు రాజన్ హాని చేస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకున్నాయి. నేను దెయ్యం అయితే, ఈ వ్యక్తి దేవుడు. మనల్ని రక్షించడానికి బయటి నుంచి వచ్చాడు’ అని స్వామి విరాట్ హిందుస్తాన్ సమావేశంలో అన్నారు.
అధిక స్థాయిలో ద్రవ్యోల్బణం..
వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కూరగాయల ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఖరీఫ్ పంటలు మార్కెట్లోకి వచ్చి ధరలు తగ్గడానికి మరికొన్ని నెలలు పడుతుంది. - అరుంధతీ భట్టాచార్య, చైర్‌పర్సన్, ఎస్‌బీఐ
50 పాయింట్ల మేర కోతకు అవకాశం..
స్థూల ఆర్థిక పరిస్థితులను చూస్తే ఆర్‌బీఐ 50 బేసిస్ పాయింట్ల కోత విధించవచ్చు. బ్రిటన్ సహా చాలా దేశాల్లో రేట్లు తగ్గుముఖం పట్టాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం, ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు తక్కువగా ఉండడం, అధిక విదేశీ మారక నిల్వలు, బాండ్ ఈల్డ్ తక్కువగా ఉండడం, కరెంటు ఖాతా, ద్రవ్యలోట్లు పరిమితుల్లోనే ఉండడం వల్ల 50 పాయింట్ల కోతకు అవకాశం ఉంది.
- రాణా కపూర్, ఎండీ, యస్‌బ్యాంక్
25 పాయింట్ల మేర కోత..
ఈ సమీక్షలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తుందని భావిస్తున్నాం. వర్షపాతం బాగుంటే ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల సాగు గతేడాదితో పోలిస్తే 39% ఎక్కువగా ఉంది. - బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్