
సంక్షోభంలో చక్కెర పరిశ్రమ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చక్కెర దిగుమతికి కేంద్రం తలుపులు బార్లా తెరవడం.. చక్కెర పరిశ్రమల నుంచి ఐదు శాతం వ్యాట్‌ను వసూలు చేస్తుండటం.. కర్ణాటక, తమిళనాడు నుంచి చక్కెర అక్రమ రవాణాను అరికట్టడంలో వైఫల్యం వెరసి ఆంధ్రప్రదేశ్‌లో చక్కెర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. కనీసం చెరకు రైతులకు బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితిలో సహకార చక్కెర పరిశ్రమలు కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, ఉభయగోదావరి జిల్లాల్లో 15 లక్షల హెక్టార్లలో రైతులు చెరకును సాగుచేస్తున్నారు.
చెరకు పంటపై ఆధారపడి రాష్ట్రంలో 11 సహకార చక్కెర కర్మాగారాలు, 26 ప్రైవేటు చక్కెర పరిశ్రమలను ఏర్పాటుచేశారు. 2012 వరకూ చక్కెరకు మంచి డిమాండ్ ఉండేది. కిలో చక్కెర రూ.36 నుంచి రూ.37 వరకూ పలికేది. మార్కెట్లో డిమాండ్ ఉండటం వల్ల ఉత్పత్తి చేసిన చక్కెరకు గిట్టుబాటు ధర దక్కేది. చక్కెర పరిశ్రమలు.. చెరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ.. డిసెంబర్, 2012లో కేంద్ర ప్రభుత్వం చక్కెర దిగుమతికి తలుపులు బార్లా తెరిచింది.
విదేశాల నుంచి భారీ ఎత్తున చక్కెర దిగుమతి చేసుకోవడం వల్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. డిసెంబర్, 2012లో కిలో చక్కెర రూ.36 పలకగా.. జనవరి, 2013 నాటికి రూ.24కు పడిపోయింది. విదేశాల నుంచి భారీ ఎత్తున చక్కెర దిగుమతి కావడంతో పంచదారకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాల్లో 2012-13, 2013-14ల్లో ఉత్పత్తి చేసిన 38 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా చక్కెర నిల్వలకు సరైన ధర దక్కపోవడం వల్ల పేరుకుపోయాయి.
దీంతో పరిశ్రమకు చెరకును సరఫరా చేసిన రైతులకు బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఒక్క సహకార కర్మాగారాలే రైతులకు రూ.85 కోట్లకుపైగా బకాయి పడ్డాయి. చిత్తూరు జిల్లాలో శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారం రూ.9.64 కోట్లు, చిత్తూరు సహకార చక్కె ర కర్మాగారం రూ.8.93 కోట్లు మొత్తం రూ.18.57 కోట్ల మేర రైతులకు బకాయిపడ్డాయి. ప్రైవేటు పరిశ్రమలదీ అదే దుస్థితి. ప్రైవేటు పరిశ్రమలు చెరకు రైతులకు రూ.102 కోట్లకు పైగా బకాయిపడ్డాయి. ఒక టన్ను చెరకుపై రైతులకు రూ.300 చొప్పున ప్రోత్సాహకంగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదు. ప్రభుత్వం పోత్సాహక రూపంలో చెల్లించాల్సిన బకాయిలే రూ.95 కోట్లకు చేరుకోవడం గమనార్హం.
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే..
కేంద్ర ప్రభుత్వం చక్కెర దిగుమతికి అనుమతించి రాష్ట్రంలో పరిశ్రమలను దెబ్బతిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వాటిని సంక్షోభంలోకి నెట్టాయి. రాష్ట్రంలో 11 సహకార చక్కెర కార్మాగారాల్లో ఇప్పటికే మూడు పరిశ్రమలు మూతపడ్డాయి. ఎనిమిది కర్మాగారాలు మాత్రమే క్రషింగ్ చేసి.. చక్కెరను ఉత్పత్తి చేస్తున్నాయి. సహకార చక్కెర కర్మాగారాలను ఆధునీకరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పొరుగున కొన్ని రాష్ట్రాల తరహాలో పన్ను మినహాయింపులు ఇవ్వడం లేదు. చక్కెర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో సైతం వైఫల్యం జరుగుతోంది.