న్యూఢిల్లీ: వేసవిలో కోకొకోలా, థమ్సప్, స్ప్రైట్ తరహా కోలా బ్రాండ్స్ విరివిగా అమ్ముడుపోవడం కొన్నేళ్ల క్రితం వరకు చూశాం. కానీ, కొన్నేళ్లుగా వేసవి రుచులు వేగంగా మారుతున్నాయి. వినియోగదారుల నాడి పట్టుకుని, వారి అభిమానం సంపాదించేందుకు అగ్రగామి కంపెనీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వినియోగదారుల్లో ఆరోగ్యం పట్ల స్పృహ పెరగడంతో సంప్రదాయ పండ్ల రసాలు, పండ్ల రసాలు కలిపిన పానీయాల (జ్యూస్ డ్రింక్స్) మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. దీంతో సంప్రదాయ రుచులతో, చక్కెర తగ్గించి పండ్ల రసాల పానీయాలను కోక్, పెప్సీ, ఐటీసీ, డాబర్ తదితర కంపెనీలు తీసుకొస్తున్నాయి.
పళ్ల రసాల డ్రింక్స్‌కు డిమాండ్
వారం క్రితమే కోకొకోలా సంస్థ మినట్‌మెయిడ్ బ్రాండ్ కింద మూడు రకాల పండ్ల ఆధారిత డ్రింక్స్‌ను విడుదల చేసింది. తమిళనాడులో ప్రాచుర్యం పొందిన ద్రాక్ష రుచి ఆధారిత డ్రింక్‌ను మినిట్‌మెయిడ్ కలర్ పేరుతో తీసుకొచ్చింది. సంప్రదాయ పానీయాల మార్కెట్‌లో విస్తరించటమే దీని వెనుక ఉద్దేశం. మరో బహుళజాతి సంస్థ పెప్సికో సైతం ట్రోపికానా స్లైస్ పోర్ట్‌ఫోలియోలో స్థానిక డ్రింక్స్‌ను మార్కెట్‌కు పరిచేయం చేస్తోంది. ఈ కంపెనీలకు ఐటీసీ బినేచురల్ బ్రాండ్, డాబర్ రియల్ బ్రాండ్, హెక్టార్ వేవరేజెస్‌కు చెందిన పేపర్‌బోట్ గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్యాకేజ్డ్ సంప్రదాయ రుచులతో కూడిన డ్రింక్స్ మార్కెట్ గడిచిన మూడేళ్ల కాలంలో ఏటా 30–35 శాతం మధ్య పెరుగుతూ వచ్చినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. పళ్లరసాలకు డిమాండ్ ఏటేటా 17 శాతం డిమాండ్ పెరుగుతోందని అంచనా.
ఐటీసీ ప్రత్యేక దృష్టి
‘‘బినేచురల్ బ్రాండ్ కింద నూతన శ్రేణి ప్రీమియం పళ్ల రసాలు, బేవరేజెస్‌ను పారదర్శక పెట్ ప్యాక్‌లో తీసుకొచ్చాం. దేశంలో ఈ తరహా ప్యాక్ ఇదే మొదటిసారి. పైగా ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్‌లు (చెడిపోకుండా కాపాడేందుకు వినియోగించేవి) కలపలేదు’’ అని ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ మాలిక్ పేర్కొన్నారు. కెవిన్‌కేర్ కంపెనీ కూడా తక్కువ చక్కెరతో కూడిన ప్రిజర్వేటివ్‌లు లేని పళ్ల రసాలను రెండేళ్ల క్రితమే తీసుకొచ్చింది. టెండర్ కోకోనట్ వాటర్, మిల్క్‌షేక్ లైట్‌ను షుగర్, ప్రిజర్వేటివ్‌లు లేకుండా ప్రవేశపెట్టింది. తమ బేవరేజెస్ వ్యాపారంలో 55 శాతం ఈ వేసవిలోనే నమోదు అవుతుందని భావిస్తున్నట్టు ఈ విభాగం హెడ్ బీపీ రవీంద్రన్ పేర్కొన్నారు.
రూ.25,000 కోట్ల పరిశ్రమ
దేశవ్యాప్తంగా పళ్ల రసాల మార్కెట్ 3.6 బిలియన్ డాలర్లుగా (రూ.25,000 కోట్లు) ఉంది. ఎక్కువగా ప్రజాదరణలో ఉన్నది మామిడి పండు రసంతో (మ్యాంగో జ్యూస్) కూడిన పానీయాలకే. ఆ తర్వాత ఆరెంజ్, వాటర్‌మిలన్, గ్రేప్, పైనాపిల్, ఇతర పండ్ల రసాలు డ్రింక్స్ విరివిగా అమ్ముడవుతున్నాయి. ఈ మార్కెట్లో కోక్, పార్లే ఆగ్రో, పెప్సికో, డాబర్ ఆధిపత్యం చలాయిస్తున్నట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. 2018లో ఈ సంస్థల విక్రయాలు మొత్తం అమ్మకాల్లో 75 శాతంగా ఉన్నాయి. వీటిల్లోనూ మ్యాంగో డ్రింక్స్ అమ్మకాలే ఎక్కువగా ఉండడం గమనార్హం. భవిష్యత్తులోనూ పండ్ల రసాలతో కూడిన డ్రింక్స్ మార్కెట్ బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుందని యూరో మానిటర్ అంచనా వేస్తోంది. దేశీయ పరిశ్రమ ఏటా 16.5 శాతం వృద్ధిని నమోదు చేయగలదన్న అంచనాలున్నాయి. 2019–23 మధ్య అచ్చమైన పళ్ల రసాల మార్కెట్ ఏటా 9.4%, పళ్ల రసాలతో కూడిన డ్రింక్స్ మార్కెట్ 14.8 శాతం చొప్పున వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment