లండన్: బ్రిటన్ సంపన్నుల్లో హిందుజా సోదరులు రెండో స్థానంలో నిలిచారు. కెమికల్స్ వ్యాపారి జిమ్‌రాట్‌క్లిఫ్ అత్యంత సంపన్నుడిగా ప్రథమ స్థానంలో ఉన్నారు. రాట్‌క్లిఫ్ సంపద 21.05 బిలియన్ పౌండ్లు కాగా... శ్రీచంద్(82), గోపీచంద్ హిందుజా(78)ల ఉమ్మడి సంపద 20.64 బిలియన్ పౌండ్లుగా ఉన్నట్టు ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2018’ పేర్కొంది. 1,000 మంది బ్రిటన్ సంపన్నులతో ఈ నివేదిక విడుదలైంది. ఇందులో భారత సంతతికి చెందిన 47 మంది కంటే హిందుజా సోదరులు ముందున్నారు.
హిందుజా సోదరులు 2017తో పోల్చుకుంటే 4.44 బిలియన్ డాలర్ల మేర తమ సంపద విలువను పెంచుకున్నప్పటికీ స్వల్ప తేడాతో తొలి స్థానం చేజార్చుకున్నారు. అశోక్ లేలండ్, ఇండస్‌ఇండ్ బ్యాంకు సహా హిందుజాల ఆధ్వర్యంలో ఎన్నో కంపెనీలు నడుస్తున్నాయి. ఈ జాబితాలో మీడియా దిగ్గజం సర్‌లెన్ బ్లావత్నిక్ 15.26 బిలియన్ పౌండ్లతో మూడో స్థానంలో ఉండగా, జన్మతః భారతీయులైన డేవిడ్, సిమన్ రూబెన్ సోదరులు 15.09 బిలియన్ పౌండ్లతో మూడో స్థానం నుంచి నాలుగుకు దిగిపోయారు.
లక్ష్మి నివాస్ మిట్టల్ 14.66 బిలియన్ పౌండ్లతో ఐదో స్థానంలో ఉన్నారు. ఇక, ప్రపంచ టాప్–50 సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 31.7 బిలియన్ పౌండ్లతో 19వ స్థానం దక్కించుకున్నారు. వాల్‌మార్ట్ యజమానులు వాల్టన్ కుటుంబం మొదటి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment