అంబానీ కొత్త కారు.. తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్! | Ambani family buys Indias first Bulletproof Rolls Royce | Sakshi
Sakshi News home page

అంబానీ కొత్త కారు.. తొలి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్!

Published Fri, Jan 24 2025 9:48 PM | Last Updated on Fri, Jan 24 2025 9:56 PM

Ambani family buys Indias first Bulletproof Rolls Royce

ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani). అత్యంత సంపన్నులుగా ఐశ్వర్యానికి, హోదాకు పేరుగాంచిన అంబానీ కుటుంబం (Ambani family) దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కార్ల సేకరణను కూడా కలిగి ఉంది. జియో గ్యారేజ్‌లో ఉన కార్ల ఖచ్చితమైన లెక్క తెలియదు కానీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో రోల్స్-రాయిస్ కల్లినన్ ఎస్‌యూవీలు (Rolls-Royce Cullinan) వీరి వద్దే ఉన్నాయి. ఇలాంటి కార్లు వీరి వద్ద కనీసం పది ఉంటాయని చెబుతారు. ఇప్పుడు మరో​ కొత్త రోల్స్ రాయిస్ కారు చేరింది. ఇది సాధారణ కుల్లినన్ కారు కాదు. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్.

జియో గ్యారేజ్‌కి ప్రత్యేక అతిథి
అంబానీ ఫ్యామిలీ కొత్త కారు అంటూ ఈ ప్రత్యేకమైన రోల్స్‌ రాయిస్‌ కల్లినన్ ఫొటోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ఆటోమొబిలి ఆర్డెంట్ ఇండియా వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఇవి షేర్‌ అయ్యాయి. బుల్లెట్‌ఫ్రూఫింగ్ కార్లలో ప్రత్యేకత కలిగిన చండీగఢ్ వర్క్‌షాప్‌లో అద్భుతమైన సిల్వర్ ఎస్‌యూవీ కనిపించింది. ‘తమ వద్ద ఉన్న కుల్లినన్‌లతోపాటు అంబానీ కుటుంబం బుల్లెట్‌ప్రూఫ్‌ను కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు. అంబానీ ఫ్లీట్ నుండి అందమైన సిల్వర్‌ రోల్స్ రాయిస్ కల్లినన్ ఇదే’ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఫొటోల్లో కల్లినన్ సిరీస్ I మోడల్‌గా కనిపిస్తోంది. ఇది ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ కార్ల కలెక్షన్‌లో భాగమై ఉండవచ్చు. దాన్నే బుల్లెట్‌ప్రూఫ్ చేయిస్తుండవచ్చు. ముఖేష్ అంబానీ సాధారణంగా భారీ భద్రత కలిగిన మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌ 680 (Mercedes-Benz S 680) గార్డ్ సెడాన్‌లలో ప్రయాణిస్తూ కనిపిస్తారు. అయితే భారతదేశంలో ఎస్‌యూవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా బుల్లెట్ ప్రూఫ్ కల్లినన్ తమ అవసరాలకు బాగా సరిపోతుందని కుటుంబం భావించి ఉండవచ్చు.

అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీ
రోల్స్ రాయిస్ కల్లినన్ అత్యంత లగ్జరీ కారు. 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్‌డ్‌ V12 ఇంజన్ 563 Bhp, 850 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 
విస్తృతమైన కస్టమైజేషన్‌ ఆప్షన్స్‌కు ఇది ప్రసిద్ధి చెందింది. బెస్పోక్ ఫీచర్‌ల ఆధారంగా కుల్లినన్ ధర ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్‌డ్‌ బాడీవర్క్ కోసం వర్క్‌షాప్‌కు పంపిన నేపథ్యంలో దీని తుది ధరను అంచనా వేయడం సవాలుగా మారింది.

అంబానీ రోల్స్ రాయిస్ కలెక్షన్
రాయిస్ కలెక్షన్ కల్లినన్‌ కార్లతో అంబానీ ఫ్యామిలీ అనుబంధం 2019 నాటిది. భారతదేశంలో మొట్ట మొదటగా ఈ మోడల్‌ను కొనుగోలు చేసింది అంబానీ కుటుంబమే. రిచ్ బ్రౌన్ షేడ్‌ వాహనం మొదటి కల్లినన్ కాగా ఆ తర్వాత 2021లో ఆర్కిటిక్ వైట్‌ కలర్‌ కార్‌ వచ్చింది.

మూడవ కల్లినన్‌ను వారి కుమార్తె ఇషా అంబానీ ఉపయోగించారు. దాదాపు రూ. 1 కోటి విలువైన టస్కాన్ సన్ కల్లినన్ కూడా ఈ కలెక్షన్‌లో ఉంది. దీపావళి సందర్భంగా నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చిన ప్రీమియం మోడల్ బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్. పెబుల్ ప్యారడిసో బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్‌ను అనంత్ అంబానీ పెళ్లికి ముందు కొనుగోలు చేశారు. సిరీస్ II కల్లినన్ తాజాగా ఫ్లీట్‌లో చేరింది. వీటితో పాటు విదేశాల్లోనూ   కులినన్‌ వాహనాలు అంబానీ ఫ్యామిలీకి ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement