ఏఐకు బానిసలుగా మారొద్దు | Mukesh Ambani shared vision for India future that AI holds immense potential and not become overly dependent on it | Sakshi
Sakshi News home page

ఏఐకు బానిసలుగా మారొద్దు

Published Wed, Jan 29 2025 9:13 AM | Last Updated on Wed, Jan 29 2025 12:30 PM

Mukesh Ambani shared vision for India future that AI holds immense potential and not become overly dependent on it

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ఇటీవల జరిగిన పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కృత్రిమమేధపై చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. భారతదేశ భవిష్యత్తుకు కృత్రిమమేధ(AI) వాడకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ఏఐ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, దాని శక్తిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలన్నారు. కృత్రిమమేథపై అతిగా ఆధారపడకూడదని, దానికి బానిసలుగా మారకూడదన్నారు.

కృత్రిమ మేధను మానవ సామర్థ్యాలను పెంపొందించే సాధనంగా చూడాలి తప్ప.. వాటిని భర్తీ చేసే మార్గంగా చూడరాదని అంబానీ స్పష్టం చేశారు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, అందరికీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలని ఆయన విద్యార్థులను కోరారు. ఏదేమైనా, సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలుగా మారవద్దని ఆయన సూచించారు. కృత్రిమ మేధ అభివృద్ధి, జనరేటివ్‌ ఏఐలో నైతిక విలువల పాత్ర, వీటిపై మానవ పర్యవేక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

అత్యంత సంపన్న దేశంగా..

ఈ శతాబ్దం చివరినాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా అవతరిస్తుందని ఆయన అంచనా వేశారు. యువత, జనాభా, సాంకేతిక పురోగతి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్ఫూర్తితో దేశ సామర్థ్యంపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగాల్లో సరైన విధానాలు, పెట్టుబడుల్లో వృద్ధి దేశ ప్రగతికి తోడ్పడుతుందని చెప్పారు.

యూనివర్సిటీ ఆఫ్‌ లైఫ్‌..

విద్యార్థులు ఉన్నత కలలు కనాలని, వాటిని సాకారం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రపంచంలో అన్ని రంగాల్లో నిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా నిరంతరం అభ్యాసం చేయాలన్నారు. ప్రస్తుతం నైపుణ్యాల పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం సహాయకారిగా ఉన్నప్పటికీ, అంతిమంగా మానవ స్ఫూర్తి, సంకల్పమే విజయాన్నిస్తుందని చెప్పారు. విద్య పూర్తి చేసుకుని ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత క్యాంపస్, తరగతి గదులు, ఉపాధ్యాయులు లేని మరో ‘యూనివర్సిటీ ఆఫ్ లైఫ్’లో అడుగుపెట్టాల్సి ఉంటుందన్నారు. అందులో మీరు సొంతంగా జీవితంలో పురోగతి సాధించాలన్నారు.

ఇదీ చదవండి: మొబిక్విక్, క్రెడ్‌లో ఈ–రూపీ వాలెట్లు

పీడీఈయూ ఏర్పాటు ఇలా..

ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ అంబానీ ‘పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం ప్రధానమంత్రి అసాధారణ దార్శనికత ఫలితమే. ఇరవై ఏళ్ల క్రితం ప్రపంచ స్థాయి మానవ వనరులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తూనే ఇంధనం, ఇంధన ఉత్పత్తులలో గుజరాత్ దేశాన్ని నడిపించాలని కోరుకుంటున్నట్లు ఆయన నాతో చెప్పారు. అదే ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు దారితీసింది’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement