న్యూఢిల్లీ: ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంతృప్తి పడి, అలసత్వం వహించబోమని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. డిజిటల్ డేటా ప్లాట్‌ఫాంలు, కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంలో ప్రపంచ టాప్ 10 వ్యాపార దిగ్గజాల్లో ఒకటిగా ఎదగడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జయంతి సందర్భంగా నిర్వహించే రిలయన్స్ ఫ్యామిలీ డేలో పాల్గొన్న సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ‘నేడు దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సాధించిన వాటితో సంతృప్తి చెంది ఆగిపోవడానికి తావు లేదు. రిలయన్స్ ఎప్పటికప్పుడు కొంగొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతుంది’ అని అంబానీ చెప్పారు.
‘ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా ఎదిగేందుకు భారత్ ముందుకు పరుగులు తీస్తున్న నేపథ్యంలో రిలయన్స్ ఎదుట అసాధారణ అవకాశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ 10 వ్యాపార దిగ్గజాల్లో రిలయన్స్ ఎదగగలదు. తప్పకుండా ఎదుగుతుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ఉద్యోగులంతా కస్టమర్లకు మరింత విలువ చేకూర్చేలా సేవలందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. డిజిటల్ డేటా ప్లాట్‌ఫామ్‌లు.. ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్లలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, సంస్థాగత సంస్కృతి విషయంలో అంతర్జాతీయ దిగ్గజాల్లో ఒకటిగా ఎదగడం నూతన సంవత్సర తీర్మానాలుగా నిర్దేశించుకోవాలని ఆయన సందేశమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment