న్యూఢిల్లీ: బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి ఆర్‌బీఐ ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో బిట్‌కాయిన్ విలువ ఒక్కసారిగా పతనమైంది. ఏకంగా రూ. 10 వేల మేర క్షీణించింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం కాయిన్‌గెకోడాట్‌కామ్‌లో ఒక దశలో బిట్‌కాయిన్ విలువ రూ. 4,58,105 నుంచి రూ. 4,47,998కి పడిపోయింది.
క్రిప్టోకరెన్సీలను ఉపయోగించే సంస్థలు, ట్రేడర్లు, వ్యక్తులకు.. సదరు వర్చువల్ కరెన్సీపరమైన సర్వీసులను, వ్యాపార లావాదేవీలను నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశిస్తూ రిజర్వ్ బ్యాంక్ జూలై 6న సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకు మూడు రోజుల గడువిచ్చింది. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలతో పాటు వాటిల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కూడా ఇది శరాఘాతంగా మారింది.
బ్యాంకింగ్ మార్గం మూసుకుపోవడంతో క్రిప్టోకరెన్సీపరమైన లావాదేవీలన్నీ తప్పనిసరిగా నగదు రూపంలోనే నిర్వహించాల్సి వస్తుందని.. అది కుదరకపోవచ్చు కనుక మొత్తానికి లావాదేవీలన్నీ నిల్చిపోయే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఆదేశాలను సవాలు చేస్తూ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆర్‌బీఐ నిర్ణయం ఏకపక్షమైనదని, రాజ్యాంగవిరుద్ధమని వాదించింది. అయినప్పటికీ.. ఆర్‌బీఐ ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment