బ్యాంకులకుమాల్యా ఆస్తుల చిట్టా!
సుప్రీంకోర్టు ఆదేశం...
♦ రహస్యంగా ఉంచాలన్న విన్నపం తిరస్కృతి
♦ రికవరీ కేసును రెండు నెలల్లో తేల్చాలని బెంగళూరు డీఆర్‌టీకి ఆదేశం
♦ దేశానికి తాను రావాలనడంలో అర్థంలేదని కింగ్‌ఫిషర్ చీఫ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ‘ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ ఎగవేతదారు’ విజయ్‌మాల్యా, ఆయన కుటుంబం ఆస్తుల వివరాలను బ్యాంకింగ్ కన్సార్షియంకు అందజేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. అంతకుముందు తన న్యాయవాది ద్వారా దేశ విదేశాల్లోని తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించిన మాల్యా, ఈ వివరాలను గోప్యంగా ఉంచాలని అభ్యర్థించారు. అయితే ఈ అభ్యర్థనను జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. మాల్యా అభ్యర్థనకు ఎలాంటి ప్రాతిపదిక, అర్థం లేదని సైతం సుప్రీం పేర్కొంది.
డీఆర్‌టీకి ఆదేశం...
తమ రుణ వసూళ్లకు సంబంధించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను రెండు నెలల్లో తేల్చాలని సైతం బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాసహా బ్యాంకుల కన్సార్షియంకు వడ్డీతో కలిపి మాల్యా దాదాపు రూ.9,200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే అసలు దాదాపు రూ.6,000 కోట్లలో రూ.4,000 కోట్లు చెల్లిస్తానని, మిగిలిన రూ.2,000 కోట్లు వివిధ కోర్టుల్లో తాను దాఖలు చేసిన కేసుల విచారణ, తీర్పు ఆధారంగా చెల్లిస్తామని మాల్యా గతంలో ప్రతిపాదించారు. దీనిని బ్యాంకుల కన్సార్షియం తిరస్కరించింది.
కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు: అటార్నీ
అంతకుముందు కోర్టుకు అటార్నీ జనరల్ ముకుల్ రోతగ్ని తన వాదనలు వినిపిస్తూ... మాల్యా ఏప్రిల్ 7నాటి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోలేదని వివరించారు. ధర్మాసనం సూచించిన విధంగా దేశానికి ఎప్పుడు తిరిగి వస్తానన్న విషయాన్ని తెలియజేయలేదని, సమస్య పరిష్కారం దిశలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోడానికి తగిన మొత్తాన్ని డిపాజిట్ చేయడానికీ ముందుకు రాలేదని తెలిపారు. భారత్ న్యాయవ్యవస్థ నుంచి ఆయన తప్పించుకుతిరుగుతున్నారని పేర్కొన్నారు. ఆయన దోబూచులాట ఆడుతున్నారని, కాకమ్మ కథలు అల్లుతున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే దేశానికి తిరిగిరావడంలేదని, కోర్టు ముందు నిజాలు దాస్తున్నారని పేర్కొన్నారు. భారత్‌కు తిరిగి రప్పించడానికి అవసరమైతే బ్రిటన్ ప్రభుత్వాన్నీ సంప్రదిస్తామని వివరించారు.
వస్తే.. మరుక్షణం తీహార్ జైలేనన్న భయం
అయితే మాల్యా, ఆయన కంపెనీల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు అటార్నీ జనరల్ వాదన పట్ల అభ్యంతరం తెలిపారు. ఇది వ్యాపార వైఫల్యం తప్ప... దీనితో ఉద్దేశపూర్వక ఎగవేత ఏదీ లేదన్నారు. సమస్య పరిష్కారానికి మాల్యా దేశంలో ఉండడం అవసరమని పేర్కొన్న బెంచ్, ఆయన ఎప్పుడు వస్తారని ప్రశ్నించింది. అయితే తీహార్ జైలులో తనను చూడడమే లక్ష్యంగా భారత్‌కు తనను రప్పించే ప్రయత్నం జరుగుతోందన్నది తన క్లెయింట్ ఉద్దేశంగా పేర్కొన్న న్యాయవాది, వచ్చిన తక్షణం తీహార్ జైలుకు పంపుతారని మాల్యా భావిస్తున్నట్లు తెలిపారు.ఠ
టాప్ 10 ఎగవేతదారులు వీరే!
బ్యాంకు రుణాల ఎగవేతలో విజయ మాల్యాను మించిన వారున్నారని సుప్రీం కోర్టుకు ఆర్‌బీఐ సమర్పించిన జాబితా వల్ల తేలుతోందని న్యూస్‌లాండ్రీడాట్‌కామ్ వెబ్‌సైట్ పేర్కొంది. ఆర్‌బీఐ జాబితా వివరాల్ని తాము సంపాదించామని న్యూస్‌లాండ్రీ పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్ 24 నాటికి మొత్తం మొండి బకాయిలు రూ.5 లక్షల కోట్లుగా ఉన్నాయని వివరించింది. 2005 నుంచి ఈ రుణాలు పేరుకుపోయాయని తెలిపింది. ఈ జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్న సంస్థల రుణాల మొత్తం రూ.56,000 కోట్లుగా ఉన్నాయని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పశ్చిమ బెంగాల్ బడ్జెట్‌కు దాదాపుగా సమానమని పేర్కొంది.
ఈ రుణాలిచ్చిన వాటిల్లో అధిక శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులు. బీమా కంపెనీలేనని, ఇక రుణాలు ఎగవేసిన కంపెనీల ప్రమోటర్టలో కొందరికి రాజకీయ సంబంధాలు కూడా ఉన్నాయని పేర్కొంది. రాజకీయ నాయకులు ప్రభుత్వ బ్యాంకులను తమ పాడిఅవులుగా ఉపయోగించుకున్నారన్న విమర్శలు వస్తున్నాయని తెలిపింది. ఈ జాబితాను ప్రచురించి ఆయా సంస్థలు/వ్యక్తులను అపఖ్యాతి పాలు చేయడం తమ ఉద్దేశం కాదని, మొండి బకాయిల సంక్షోభంలో మరింత సమాచారం అందించడానికే ఈ జాబితా ప్రకటించామని న్యూస్‌లాండ్రీడాట్‌కామ్ స్పష్టం చేసింది.