న్యూఢిల్లీ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా నాలుగు వారాల్లోగా వెల్లడించాలని ఉన్నత ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. కాగా బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్లు ఎగ్గొట్టి, ప్రస్తుతం విజయ మాల్యా లండన్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. నెల రోజుల్లోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబరు 24కు వాయిదా వేసింది.
కాగా ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పొందిన రూ.900 కోట్ల పైచిలుకు రుణాల విషయంలో మనీ ల్యాండరింగ్ కోణంపై ఈడీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గతేడాది సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రాతిపదికగా మాల్యాతో పాటు మరికొందరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. రుణాల ఎగవేత ఆరోపణలెదుర్కొంటున్న దరిమిలా మాల్యా .. దేశం విడిచి వెళ్లారు.