
బంగారం దిగొస్తోంది...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం ధర దిగొస్తోంది. వారం క్రితం 10 గ్రాముల మేలిమి బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో అటూ ఇటుగా రూ.28,300 ఉండగా, శుక్రవారం నాడు రూ.27,640కి వచ్చి చేరింది. దే శంలోని వివిధ నగరాల్లో ధర వరుసగా ఆరు రోజులపాటు క్షీణించడం విశేషం. ధర ఇంకా దిగొస్తుందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.
దసరాకల్లా రూ.26,800 వరకు రావొచ్చని అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలపడడం తదితర కారణాలతో బంగారం ధర తగ్గుతోంది. అయితే దీపావళి నాటికి తిరిగి రూ.28-29 వేలను తాకొచ్చని బులియన్ నిపుణులు చెబుతున్నారు. దీపావళి సమయంలో దేశీయంగా పుత్తడికి డిమాండ్ పెరుగుతూ వుంటుంది. ఈ కారణంగా స్వర్ణం కొనుగోలుకు ఇదే సరైన తరుణమని బులియన్ వర్తకులు సూచిస్తున్నారు.
అంతర్జాతీయంగా..
అమెరికా ఎకానమీ క్రమంగా పుంజుకుంటోంది. దీంతో బంగారంపై ప్రజల పెట్టుబడులు తగ్గుతున్నాయి. మరోవైపు యూరో వడ్డీ రేటు తగ్గించింది. దీని ప్రభావం కాస్తా డాలరు బలపడేందుకు దోహదం చేసింది. డాలరు బలపడితే సహజంగానే పుత్తడి ధర దిగొస్తుంది. మరోవైపు మోడీ ప్రభుత్వ దూకుడుకుతోడు షేర్ మార్కెట్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ ఊపుతో రూపాయి బలపడుతోంది. ఈ కారణాలతో బంగారం రేటు కిందకు వస్తోందని ఆంధ్రప్రదేశ్ బులియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.మహాబలేశ్వరరావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
ఇంకా వెల తగ్గుతుందన్న ప్రచారం ఉండడంతో కస్టమర్లు వేచి చూస్తున్నారని చెప్పారు. దీనికితోడు భారత్‌లో ప్రస్తుతం సీజన్ లేదని అన్నారు. కాగా, రూ.4 లక్షల కోట్ల విలువైన దేశీయ బంగారు ఆభరణాల మార్కెట్ లో 2014-15లో ఎటువంటి వృద్ధి నమోదు కాకపోవచ్చని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వర్తక సంఘం(జీజేఎఫ్) అంచనా వేస్తోంది. అయితే దీపావళి సీజన్‌లో మాత్రం 10-15 శాతం వృద్ధిని ఆశిస్తోంది.
మూడ్ వచ్చినప్పుడే..
ఆభరణాల విషయంలో మూడ్ వచ్చినప్పుడే కస్టమర్లు కొనుగోలు చేస్తారని హైదరాబాద్ జువెల్లరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ తెలిపారు. కొందరు వినియోగదారులు మాత్రమే ధర తగ్గొచ్చని వేచి చూస్తారని పేర్కొన్నారు. దసరా తర్వాత బంగారానికి సీజన్ మొదలవుతుందని, ధరతేరాస్, దీపావళి పీక్ సీజన్ అవుతుందని, దాంతో దీపావళి కల్లా ధర తిరిగి రూ.28-29 వేలకు చేరువ అవుతుందని చెప్పారు. స్వర్ణం కొనుగోలుకు ఇదే సరైన సమయమని ఆయన సూచిస్తున్నారు.
ఈ మధ్య ధర తగ్గుతుండటంతో దుకాణాలకు వచ్చే కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరించారు. దీపావళికల్లా అమ్మకాలు జోరందుకుంటాయని ధీమాగా చెప్పారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర క్రమేపీ తగ్గుతూ 1,266 డాలర్లకు దిగింది. నెలరోజుల క్రితం ఇది 1,300 డాలర్లకుపైగా వుంది.
ఫ్యూచర్స్‌లో ఇలా..
10 గ్రాముల మేలిమి బంగారం ధర ఫ్యూచర్స్ మార్కెట్లో శుక్రవారం రూ.27,400లోపునకు తగ్గింది. అంతర్జాతీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండడంతో స్పెక్యులేటర్లు పొజిషన్లను తగ్గించడమే ఈ క్షీణతకు కారణం. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ డెలివరీ ధర రూ.100 మేర పడిపోయింది. డిసెంబర్ డెలివరీ రూ.36 తగ్గి రూ.27,599గా ఉంది.