బోస్టన్ : నాశువా హై స్కూల్ సౌత్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్(టీఏజీబీ) దసరా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 700ల మందికిపైగా ప్రవాసాంధ్రుల విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమ ప్రాంగణాన్ని రూబి బోయినపల్లి ఆధ్వర్యంలో అలంకరించారు. బోర్డు ట్రస్ట్ సభ్యులు పద్మ పరకాల, సురేందర్ మాదాదిలు జ్యోతి ప్రజ్వలన చేయగా, అధ్యక్షురాలు మణిమాల చలుపాది స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది.
చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక పాటలు, భజనలు, డ్యాన్సులు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వేదికపై 'బతుకమ్మ' పండగ వేడుకలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కూచిపూడి నాట్యాలయం విద్యార్థులు 'నారాయణతే నమో నమో' నృత్యం లో దశావతారాలు చూపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇవే కాక, వేదికపైననే సరదా 'సరదాగా కాసేపు' జరిపించిన వివాహ వేడుకలు, బాలలహరి విద్యార్థుల 'భక్తి గీతాలు', శ్రీరామ్ రేకపల్లి, ఎమ్‌వీఎన్ కిరణ్ కుమార్‌ల మృదంగం, వయోలిన్ 'జుగల్బందీ', "జరిగింది చెప్తాను, జరిగేది చెప్తాను" అని వచ్చి, నేటి తరం సెల్ ఫోన్‌ల వ్యసనంతో ఎటువంటి ముప్పుల్లో పడుతున్నారో విడమర్చి చెప్పిన 'సోది' లాంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. మానస కృష్ణ నేపథ్యంలో ప్రదర్శించిన 'నవదుర్గా నర్తనం - మహిషాసుర మర్దనం' నృత్యము ప్రేక్షకులని భక్తి సామ్రాజ్యంలో ఓలలాడించి, మొత్తం దసరా కార్యక్రమానికే కలికితురాయిలా నిలిచింది. కల్చరల్ సెక్రటరీ పద్మజా బాలా పర్యవేక్షణలో కల్చరల్ టీమ్ రెండు నెలలకు పైగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అరుణ్ మూల్పూర్, సుధా మూల్పూర్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
కార్య వర్గ సభ్యులు సీతారాం అమరవాది, రమణ దుగ్గరాజు,రామకృష్ణ పెనుమర్తి, సత్య పరకాల కార్యక్రమాన్నిపర్యవేక్షించారు. హరిత బృందం నిర్వాహకులు మాధవికమ్మ, చందశేఖర్ కమ్మలను టీఏజీబీ సత్కరించింది. వైస్ చైర్మన్ శివ దోగిపర్తి టీఏజీబీ సభ్యుల తరఫున అందరికి పండగ శుభాకాంక్షలుతెలియజేశారు. టీమ్ ఏయిడ్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నన్నపనేని మోహన్, పలు మానసిక, శారీరక కష్టాలకు గురి అయిన తెలుగు వారికి తమ సంస్థ ద్వారా ఎటువంటి సేవలు సహాయాలు అందిస్తున్నారో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment