
సింగపూర్‌లో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారిగా దేవీ శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు సందర్భంగా ఒక్కో రోజు ఒక్కొక్కరి ఇంట్లో వివిధ అలంకారాల్లో అమ్మవారిని కొలిచారు. ఇందులో పెద్ద ఎత్తున క్లబ్ సభ్యులు పాల్గొని.. ఉదయం విష్ణుసహస్ర నామాలు, సాయంత్రం అమ్మవారి ప్రత్యేక అలంకరణతో పాటు లలితా సహస్రం, మణిద్వీప వర్ణన, అమ్మవారి కీర్తనలు ఆలపించారు.
బాలత్రిపుర సుందరి స్వరూపాలైన కన్యపిల్లలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారియమ్మన్ కోవెలలో జరుగబోయే మహాకుంభాభిషేక క్రతువులో భాగంగా ఈ ఏడాది వైశ్యులంతా నిత్యనామస్మరణ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టి దసరా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వీటితో పాటుగా నిత్య పారాయణములు, నెల నెలా ఇంటింటి భక్తి కార్యక్రమాలు, దేవినవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అందరు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలెనని క్లబ్ అధ్యక్షులు తెలిపారు. దేవి నవరాత్రుల అలంకరణతో పాటు ప్రతినెల కార్యక్రమ సమన్వయకర్తలుగా సరిత బూరుగు, చైతన్య అంబటి, హేమ కిషోర్ గార్లు కీలకంగా వ్యవహరించారు. వాసవి క్లబ్ మెర్లయన్ సింగపూర్ స్తాపించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేశారు.