భోజన ప్రియుల ‘స్వాద్’ ! | Svad App for different tastes | Sakshi
Sakshi News home page

భోజన ప్రియుల ‘స్వాద్’ !

Published Sat, Dec 13 2014 1:23 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

భోజన ప్రియుల ‘స్వాద్’ ! - Sakshi

భోజన ప్రియుల ‘స్వాద్’ !

క్లిక్ దూరంలో టేస్టీ వంటకాలు
35 వేలకుపైగా వంటల సమాచారం
స్వాద్ యాప్‌తో అందుబాటులోకి
రూపొందించిన హైదరాబాదీ స్టార్టప్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లూబెర్రీ చీస్‌కేక్ టేస్ట్ చేయాలని ఉందా? చట్‌పటా పావ్ భాజీ లాగించాలా? ఇంతకీ ఇవి ఏ రెస్టారెంట్లో దొరుకుతాయి? ఎక్కడ టేస్టీగా ఉంటుందన్నదే కదా మీ సందేహం. రెస్టారెంట్ల చిరునామాతోపాటు ఎక్కడ రుచికరంగా ఉంటాయో తెలిస్తే.. ఇంకేముంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వీకెండ్ పార్టీ డిసైడ్ అయిపోయినట్టేగా. ఇదిగో మీ కోసమే హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్వాద్ వినూత్న అప్లికేషన్‌ను (యాప్) అభివృద్ధి చేసింది. భాగ్యనగరిలో ఉన్న రెస్టారెంట్లు, వాటి చిరునామా, ఫోన్ నంబర్లతోపాటు ఒక్కో రెస్టారెంట్లో లభించే వంటకాలు, ధరలు కూడా ఈ స్వాద్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. విశేషమేమంటే కావాల్సిన వంటకాలు ఎక్కడ బాగుంటాయో ఈ యాప్ ఇట్టే చెప్పేస్తుంది.

ఫుడీస్ సహకారంతో..
హైదరాబాద్ ఫుడీస్ క్లబ్, దేశీ ఫుడీస్ వంటి ఫుడీస్ (భోజన ప్రియుల) క్లబ్ సభ్యుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్వాద్ సేకరిస్తుంది. ఈ రెండు క్లబ్‌లలో కలిపి 40 వేల మంది దాకా సభ్యులున్నారు. వీరంతా వారంలో మూడుసార్లయినా హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లకు వెళ్తుంటారు. కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళ్లి విభిన్న రుచులను ఆస్వాదిస్తుంటారు.

ఫుడీస్ నుంచి స్వాద్ టీమ్ సమాచారం సేకరించి బెస్ట్ ఫుడ్‌ను వెబ్‌సైట్లో అప్‌డేట్ చేస్తుంది. ఇక స్వాద్ యూజర్లు రెస్టారెంట్లో ఆరగించిన వంటకం రుచి ఎలా ఉందో చెబుతూ లైక్స్, కామెంట్ పోస్ట్ చేస్తుంటారు. ఈ సమాచారం ఆధారంగా ఇతర యూజర్లు ఒక్కో రెస్టారెంట్లో ఏ వంటకాన్ని టేస్ట్ చేయాలో నిర్ణయించుకోవచ్చని స్వాద్ సహ వ్యవస్థాపకురాలు శ్రావ్య రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు.

కొత్తవీ తెలుసుకోవచ్చు..
రెస్టారెంట్లు తరచూ మెనూను మారుస్తుంటాయి. కొత్త కొత్త వంటకాలు వచ్చి చేరుతుంటాయి. ఈ సమాచారం రెస్టారెంట్‌కు వెళితేగానీ కస్టమర్లకు తెలియదు. అదే స్వాద్ యాప్‌లో సమాచారం అప్‌డేట్ అవుతూ ఉంటుంది. దీనికితోడు నచ్చిన ఫుడ్ ఎక్కడ రుచిగా ఉంటుందో తెలిస్తే కస్టమర్‌కు సమయం ఆదా అవుతుంది. హోటల్‌కు వెళితే మంచి ఫుడ్ తిన్నామన్న తృప్తి ఉంటుందని శ్రావ్య రెడ్డి తెలిపారు.

‘కొద్ది రోజుల్లో ఫేస్‌బుక్‌కు స్వాద్‌ను అనుసంధానించనున్నాం. స్వాద్ యాప్ యూజర్లకు ఫేస్‌బుక్‌లోనూ అకౌంట్ ఉన్నట్టయితే.. యూజర్లు ఏదైనా ఫుడ్‌ను లైక్ చేస్తే ఆ సమాచారం ఫేస్‌బుక్ ద్వారా వారి మిత్రులకు చేరుతుంది. ఇక కస్టమర్లు ఇచ్చే స్పందన సమాచారాన్ని అందించేందుకు భవిష్యత్తులో హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి కొంత ప్రీమియం చార్జీ చేస్తాం. ఈ సమాచారంతో పొరపాట్లేవైనా ఉంటే సరిదిద్దుకోవడానికి, వంటలను మరింత రుచిగా అందించేందుకు వీటికి వీలవుతుంది’ అని తెలిపారు.
 
ఫుడీస్ కావడంతో..
హైదరాబాద్‌కు చెందిన శ్రావ్య రెడ్డి, ధ్రువతేజ రెడ్డి, శశికాంత్ రెడ్డి 2012లో బీటెక్ పూర్తి చేశారు. సొంతంగా కంపెనీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. స్వతహాగా ఫుడీస్ కావడంతో స్వాద్ ఏర్పాటుకు బీజం పడింది. ప్రస్తుతం 900లకు పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌ల సమాచారం యాప్‌లో నిక్షిప్తమై ఉంది. 35 వేల పైచిలుకు ప్రముఖ, వినూత్న వంటకాలను పొందుపరిచారు.

ప్రస్తుతానికి క్లయింట్ల నుంచి ఎటువంటి చార్జీ చేయడం లేదు. నవంబర్ 19న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను సుమారు 500 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యాప్ అభివృద్ధికి ఇప్పటికే రూ.10 లక్షలకుపైగా వ్యయం చేశారు. ఇందుకు కావాల్సిన నిధులను ఒక ఎన్నారై సమకూరుస్తున్నారు. ఇతర నగరాలకు విస్తరించాలన్నది స్వాద్ ప్రణాళిక. ఇందుకోసం ఆరు నెలల్లో రూ.12 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement