
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట్లో ఫ్యాన్ లేదా లైట్‌కు ఆన్–ఆఫ్ బటన్ ఉన్నట్టే.. చేతిలోని డెబిట్, క్రెడిట్ కార్డులనూ స్విచాఫ్ చేసే వీలుంటే? లేకనేం... ఆగస్టు నుంచి ఈ సరికొత్త సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తున్నాయ్. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్సీ అనుసంధానిత ఈ–షీల్డ్ యాప్‌ను దేశంలో పరిచయం చేస్తోంది ముంబైకి చెందిన ఆటమ్ టెక్నాలజీస్.
డెబిట్, క్రెడిట్ కార్డులను ఆన్–ఆఫ్ చేయటం ద్వారా ఆన్‌లైన్ మోసాలకు చెక్ చెప్పడంతో పాటూ బ్యాంక్‌లకు కస్టమర్ కేర్ నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని ఆటమ్ సీఈఓ దేవాంగ్ నేరళ్ల ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.
స్మార్ట్‌ఫోన్ లేకున్నా సేవల వినియోగం..
వాస్తవానికి ఈ–షీల్డ్ సాంకేతికతను ఆస్ట్రేలియాకు చెందిన ట్రాన్‌వాల్ అభివృద్ధి చేసింది. మధ్య ప్రాచ్య, ఆఫ్రికాలోని ఐదారు దేశాల్లో వీటిని అందిస్తోంది కూడా. ముంబైకి చెందిన ఆటమ్ టెక్నాలజీస్‌తో ప్రత్యేక ఒప్పందం చేసుకొని భారత్‌లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. భారతీయుల అవసరాలు, ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా టెక్నాలజీలో కొద్ది మార్పులు చేశామని దేవాంగ్ తెలిపారు. ఈ–షీల్డ్ ఎలా పనిచేస్తుందంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) అనుసంధానిత యాప్. వాయిస్, చాట్ ద్వారా ఇది యాక్టివేట్ అవుతుంది.
డెబిట్, క్రెడిట్ కార్డులను ఆన్–ఆఫ్ చేయటమే కాకుండా పరిమిత లావాదేవీలు, ఏరియాల వారీగా, విదేశీ లావాదేవీలనూ నియంత్రించవచ్చు. కార్డు, అకౌంట్ స్టేటస్, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలను వినియోగించుకోవ చ్చు. స్మార్ట్‌ఫోన్ లేని కస్టమర్లు ఎస్‌ఎంఎస్ ద్వారా ఈ–షీల్డ్ సేవలను వినియోగించుకునే వీలుంది. ఈ–షీల్డ్ సేవల కోసం దేశంలోని ఒకటిరెండు ప్రధాన బ్యాంక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు దేవాంగ్ తెలిపారు. ఈ బ్యాంక్‌లకు ప్రతి కార్డుకూ నెలకు రూ.1–3 చార్జీ ఉంటుందని చెప్పారు.
రిటైలర్ల కోసం ‘ఎం గల్లా’..
ఒకే వేదికపై అన్ని పేమెంట్ ఆప్షన్లనూ ఉపయోగించుకునేందుకు వీలు కల్పించే ‘ఎం గల్లా’ రిటైలర్స్ యాప్‌ను దేవాంగ్ ఈ సందర్భంగా విడుదల చేశారు. భారత్ క్యూఆర్, పీఓఎస్, ఐవీఆర్, యూపీఐ, భీమ్, ఆధార్, లింక్ ఆధారిత లావాదేవీల వంటి అన్ని రకాల పేమెంట్లనూ ఎంగల్లా యాప్ నుంచి చేసుకునే వీలుందని చెప్పారాయన.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో 5,000 మంది వర్తకులు ఎం గల్లా యాప్‌ను వాడుతున్నారని, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 10 వేల మంది వర్తకులకు చేరాలని, నెలకు రూ.200 కోట్ల లావాదేవీలు నిర్వహించాలని లకి‡్ష్యంచినట్లు ఆయన తెలియజేశారు.
ఏటా రూ.50 వేల కోట్ల లావాదేవీలు..: ‘‘ఎండ్ టు ఎండ్ పేమెంట్ సేవలందించే ఆటమ్... 2006లో ప్రారంభమైంది. రిటైల్, ప్రభుత్వ విభాగాలు, డీటీహెచ్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ట్రావెల్ అండ్ టూరిజం, టెలీకమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో లక్షకు పైగా వర్తకులు ప్రస్తుతం ఆటమ్ సేవలను వినియోగిస్తున్నారు. మొత్తం వర్తకుల్లో 2 వేల మంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా రూ.1,000 కోట్ల లావాదేవీలు మా ద్వారా జరుగుతున్నాయి.
గతేడాది ఆటమ్ వేదికగా రూ.50 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19) రూ.85,000–90,000 కోట్ల లావాదేవీలు లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలో 30 లక్షల పీఓఎస్ మిషన్లున్నాయి. వీటిలో 80 వేల మిషన్లను ఆటమ్ నిర్వహిస్తోంది. వచ్చే 6 నెలల్లో మలేషియా, వియత్నాం, ఇండోనేషియా దేశాలకు విస్తరిస్తాం’’ అని దేవాంగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment